ఖమ్మం అర్బన్, మార్చి 10 : రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలైన నేపథ్యంలో తమ మార్కులు తెలుసుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అధికారులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి అభ్యర్థుల మార్కులను అందుబాటులో ఉంచగా.. తమ మార్కులు కనిపించాలంటే మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి.
అయితే చాలా మంది అభ్యర్థులు ఎన్నిసార్లు ప్రయత్నించినా వారి ఫోన్లకు ఓటీపీ రాలేదు. సుమారు గంట తర్వాత ఓటీపీలు రావడంతో ఫలితాలు చూసుకున్నారు. మొత్తం ఏడు సబ్జెక్టుల్లో పరీక్ష జరగ్గా ఇంగ్లిష్ అర్హత పేపర్ మాత్రమే కాగా.. మిగిలిన ఆరు పేపర్లలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుని కటాఫ్ నిర్ణయించే అవకాశం ఉంది.
గ్రూప్-1 మెయిన్స్ మార్కులను మాత్రమే వెల్లడించిన టీఎస్పీఎస్సీ రీ కౌంటింగ్‌కు అవకాశం కల్పించింది. రూ.వెయ్యితో ఒక సబ్జెక్ట్‌కు చొప్పున చెల్లించాలని స్పష్టం చేసింది. గ్రూప్-1 పోస్టుల భర్తీని మల్టీజోన్ల వారీగా భర్తీ చేయనుండడంతో అభ్యర్థులు తమ మార్కుల ఆధారంగా వారి కేటగిరీలలో ఎన్ని మార్కులు ఎక్కువ వచ్చాయని తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మల్టీజోన్-1 పరిధిలోకి రానున్నాయి.
గ్రూప్-1 మెయిన్స్ మార్కులు ప్రకటించిన టీఎస్పీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్) విడుదల చేయలేదు. కొంత మందికి 370కిపైగా మార్కులు రాగా, మరికొందరికి 410కిపైగా మార్కులు వచ్చిన అభ్యర్థులు జిల్లాలో ఉన్నట్లు తెలుస్తుంది. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా, ఆన్లైన్ ద్వారా, హైదరాబాద్‌లో ఉండి శిక్షణ పొందిన ఖమ్మం అభ్యర్థులు ఉన్నారు.
మొత్తం 563 పోస్టులు రాష్ట్రస్థాయిలో ఉండగా.. మల్టీజోన్-1 పరిధిలో తమ మార్కులకు ఏ ర్యాంక్ వచ్చిందో తెలియక, ఉద్యోగావకాశాలు ఎంత వరకు ఉన్నాయో స్పష్టత లేక గందరగోళంలో అభ్యర్థులు ఉన్నారు. మార్కులు ప్రకటించినప్పటికి జీఆర్ఎల్ తెలియకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. తమకు తెలిసిన మిత్రుల ద్వారా, శిక్షణ పొందిన ఇనిస్టిట్యూట్ల నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికి ఎవరికి అవకాశాలు ఉన్నాయనే దానిపై ఒక అంచనాకు రాలేకపోతున్నారు.