కారేపల్లి, ఏప్రిల్ 17 : సింగరేణి(కారేపల్లి) మండల పరిధిలోని బీక్యాతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేసి పదవీ విరమణ పొందిన కర్నాటి సువర్ణను పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, గ్రామస్తులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. రైల్వే గేట్ వద్దకు చేరుకున్న ఉపాధ్యాయురాలు సువర్ణ- మాధవరావు దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల వరకు విద్యార్థులు పూలు చల్లుతూ ర్యాలీగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం పాటు సింగరేణి మండలంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సువర్ణ- మాధవరావు దంపతులు ఎంతోమంది పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అప్పాయిగూడెం సర్పంచ్ దండు ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, గ్రామ పెద్దలు అజ్మీర బిచ్చ నాయక్, అజ్మీర వీరన్న, ఉపాధ్యాయ సంఘ నాయకులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.