కల్వకుర్తి రూరల్, ఆగస్టు 17 : బీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల కోసం అమలుచేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, రేవంత్‌రెడ్డి కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడుదామని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని విమర్శించారు. కల్యాణలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తామని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. రేవంత్ సర్కారు హైకోర్టు తీర్పు సాకుతో తెలంగాణ ఆడబిడ్డలకు అందించే భరోసాను ఎత్తివేసేందకు పథకం చేస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల విషయంలో హైకోర్టులో కౌంటర్ వేయకుండా పథకాల రద్దుకు యత్నిస్తోందని ఆరోపించారు.
కాంగ్రె స్ ప్రభుత్వానికి ప్రచారాల ఆర్భాటలపైన మక్కువ పథకాల అమలుపైన లేదని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తిరిగి పునరుద్ధరించేంత వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమిస్తుందన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో అధికారికి వినతిపత్రాన్ని అం దించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు బావండ్ల మంజుల, రామునాయక్ పార్టీ పట్టణాధ్యక్షుడు మధు, మండలాధ్యక్షుడు విజయ్‌గౌడ్, నాయకులు రాంరెడ్డి, విజితారెడ్డి, కాటన్‌మిల్లు అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌రావు, నిరంజన్, అనిల్‌కుమార్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్దన్, సైదులుగౌడ్, వివిధ మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.