భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ బూర్గంపహాడ్ (భద్రాచలం)/ కొత్తగూడెం టౌన్, సెప్టెంబర్ 17: వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు పూజలందుకున్న గణేశుడికి భక్తులు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు నియోజకవర్గాల నుంచి గణపయ్య విగ్రహాలను భక్తులు ఊరేగింపుగా భద్రాచలం వద్ద గోదావరి నదికి తీసుకెళ్లారు.
భక్తులతోపాటు గణేశ్ మాలధారణ స్వాములు కాషాయ కండువాలతో స్వామి వెంట నడిచారు. ప్రతి పల్లె సందడిగా మారింది. కొత్తగూడెం జిల్లా కేంద్రం సూపర్‌బజార్ సెంటర్లో వినాయక ఉత్సవ సమితి నాయకులు ఊరేగింపుగా వస్తున్న విగ్రహాలకు పూలదండలు వేశారు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక చెరువుల్లోనే నిమజ్జనాలు జరిగాయి. కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో జరిగిన గణపతి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని శోభాయాత్రను ప్రారంభించారు.
రైల్వేస్టేషన్ సెంటర్లో ఏర్పాటుచేసిన స్వాగత వేదికపై నుంచి వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా నిమజ్జనానికి బయల్దేరిన వినాయక విగ్రహాలకు పూలమాల వేసి వీడ్కోలు పలికారు. భద్రాచలం వద్ద గోదావరి తీరమంతా భక్తులతో సందడిగా మారింది. ఇతరప్రాంతాల నుంచి కూడా భద్రాచలానికి గణేశ్ విగ్రహాలు భారీగా తరలిరావడంతో కరకట్ట వద్ద ప్రత్యేకం ర్యాంప్తోపాటు లాంచీల ద్వారా నిమజ్జనాలు చేశారు. భద్రాచలంలో 250 మంది పోలీసులతో ఎస్పీ రోహిత్‌రాజు ఆధ్వర్యంలో ఏఎస్పీ అంకిత్‌కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్డీవో దామోదరరావు, తహసీల్దార్ శ్రీనివాస్, పంచాయతీ ఈవో శ్రీనివాసరావు పర్యవేక్షణ చేశారు.