భద్రాచలం, మార్చి 15: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో వచ్చే నెల 10న వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఈసారి కల్యాణ మహోత్సవాలకు భక్తులను అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. వేడుకలకు భద్రాచలం పట్టణంలోని మిథిలా స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. చలువ పందిళ్లు, షామియానా ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే నెల 2న ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహిస్తామన్నారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక దర్శనం టికెట్ ధర పెంచేందుకు ప్రతిపాదిస్తున్నామని దేవస్థానం ఈవో బానోత్ శివాజీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక దర్శనం టికెట్ ధర రూ.50 ఉండగా, ఆ ధరను రూ.100 పెంచేందుకు ప్రతిపాదిస్తున్నామన్నారు. ధరల పెంపుపై భక్తులు తమ సలహాలు, సూచనలు, అభ్యంతరాలను 10 రోజుల్లోగా లిఖిత పూర్వకంగా దేవస్థానం కార్యాలయంలో అందజేయాలన్నారు. భక్తుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే ఏప్రిల్ 1 నుంచి ప్రతిపాదించిన టికెట్ ధరలను అమలు చేస్తామన్నారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 18న సాయంత్రం 4గంటలకు స్వర్ణలక్ష్మి అమ్మవారి పూజా మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఈవో బానోత్ శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు రూ.500 చెల్లించి పూజలో పాల్గొనవచ్చని, పూజలో పాల్గొన్న వారికి అమ్మవారి వెండి ప్రతిమ, జాకెట్ పీసు, ప్రసాదం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. పూజకు అవసరమైన సామాగ్రి దేవస్థానం వారు సమకూర్చుతారని తెలిపారు. హోలీ పండుగను పురస్కరించుకొని రామయ్యని పెళ్లికుమారుడిగా అలంకరించనున్నట్లు, ఆ రోజున స్వామివారికి నిత్య కల్యాణం రద్దు చేసినట్లు తెలిపారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని మంగళవారం రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్, టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కో-ఆర్డినేటర్ పాటిమీది జగన్మోహనరావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. లక్ష్మీ తాయారమ్మవారిని, ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. వారి వెంట ఆలయ సూపరింటెండెంట్ కత్తి శ్రీనివాస్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, నాయకులు పుల్లారావు, శ్రీను, బషీర్ తదితరులున్నారు.