అశ్వారావుపేట టౌన్, ఆగస్టు 12 : అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామపంచాయతీ కార్మికులు స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ గ్రామపంచాయతీల నిర్వహణలో కార్మికులది కీలక పాత్ర అని అన్నారు. ప్రజల అవరాలను తీరుస్తూ..
పారిశుధ్య నిర్వహణను సమర్థవంతంగా నిర్వహిస్తున్నా.. వారి సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. జీవో నెంబర్ 51ని వెంటనే సవరించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, విధి నిర్వహణలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ.10 లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో వెంకటప్పయ్య, నర్సింహారావు, ముత్తారావు, నాగభూషణం, మహేశ్ పాల్గొన్నారు.