భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఈ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకానున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ అధికారులు ఆయా పంచాయతీలకు సంబంధించిన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుని తీవ్ర కసరత్తు చేస్తున్నారు. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు, పంచాయతీల ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినట్లే ఇచ్చి చివరి దశలో రిజర్వేషన్ల విషయంలో అభ్యంతరాలు రావడంతో ఎన్నికలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
అయితే పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవాలని కోర్టు తేల్చడంతో మళ్లీ ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. గత వారం రోజులుగా రిజర్వేషన్ల ప్రక్రియపై అధికారులు కుస్తీ పడుతున్నారు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నప్పటికీ బీసీలకు అన్యాయం జరగబోతుందని రాజకీయపరంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా 46 జీవోను తీసుకొచ్చి రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టబోతున్నది. ఇది స్థానిక ఆర్డీవో, ఎంపీడీవోల స్థాయిలో చేయాలని నిర్ణయిస్తున్నారు.
భద్రాద్రి జిల్లాలో గతంలో 481 పంచాయతీలకు గాను కొత్తగా సుజాతనగర్, అశ్వారావుపేట మండలాల్లో కొన్ని జీపీలు మున్సిపాలిటీ, కార్పొరేషన్లో విలీనం కావడంతో 471 పంచాయతీలకు చేరుకుంది. దీంతో పంచాయతీ అధికారులు ఆయా పంచాయతీల పరిధిలో ఓటర్ల జాబితాను కూడా తయారు చేశారు. జిల్లావ్యాప్తంగా 6,69,048 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. గతంలో ఫైనల్ పబ్లికేషన్‌ను కూడా అధికారులు విడుదల చేశారు. పురుషులు 3,25,045, మహిళలు 3,43,979, ఇతరులు 24 మంది ఉన్నారు. తాజాగా ఈ నెల 20వ తేదీన కూడా ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులకు పంపించారు. చేర్పుల మార్పులకు కూడా మరో అవకాశం ఇచ్చే అవకాశాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
షెడ్యూల్ ఎప్పుడొచ్చినా ఎన్నికలకు సిద్ధమే అన్నట్లు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కొత్తగా వచ్చిన డీపీవో అనూష సైతం ఎన్నికలపై ఒక అవగాహనకు వచ్చారు. ఎంతమంది సిబ్బంది, ఎన్ని పంచాయతీలు, ఎన్ని వార్డులు తదితర అన్ని విషయాలపై మండల అధికారులతో ఇప్పటికే సమావేశమయ్యారు. ఈ ఆదివారం జిల్లావ్యాప్తంగా పంచాయతీ అధికారులతో సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. జిల్లాలో 471 పంచాయతీలు, 4,168 వార్డులు, 4,242 పోలింగ్ కేంద్రాలు, ఆర్ఓ వన్ 161, ఆర్ఓ టు 562 మంది, పీవోలు 5,147 మంది, ఓపీవోలు 5,674 మందిని గుర్తించి శిక్షణలు పూర్తి చేసి అందుబాటులో ఉంచుకున్నారు. ఏ సమయంలో షెడ్యూల్ వచ్చినా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారు క్యాబినెట్లో నిర్ణయించినప్పటికీ దాన్ని న్యాయస్థానం తప్పుపట్టడంతో ప్రభుత్వం కొత్త జీవోను తెరపైకి తీసుకొచ్చి పాత రిజర్వేషన్ ద్వారా ఎన్నికలకు పోవాలని నిర్ణయించింది. దీంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాత జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు న్యాయం జరుగుతుందా? లేదా? అనేది రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ తేడా జరిగినా బీసీల నుంచి ఉద్యమం తప్పదని బీసీ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.
గతంలోనే పంచాయతీ ఎన్నికల కోసం పూర్తి జాబితాను సిద్ధం చేసి ఉంచాం. ఎన్నికల శిక్షణలు కూడా పూర్తయ్యాయి. సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. షెడ్యూల్ వస్తే పనులు చకచకా జరిగిపోతాయి. జిల్లావ్యాప్తంగా 5 వేలకు పైగా సిబ్బందిని సిద్ధం చేశాం. నేడు జిల్లావ్యాప్తంగా పంచాయతీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం.
-బీ.అనూష, డీపీవో, భద్రాద్రి కొత్తగూడెం