ఖమ్మం రూరల్, మే 21 : ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో రైతులు పొలాల్లో చెత్తకు నిప్పంటించడంతో ఆ మంటలు గాలికి వ్యాపించి కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం బస్తాలకు అంటుకున్నాయి. దీంతో అక్కడ కాంటాలు వేసి ఉంచిన వరి బస్తాలు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమయ్యాయి. రైతులు వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, గాలులు బలంగా వీయడంతో మంటలు అదుపులోకి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినా స్పందన ఆలస్యమైందని రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, “మా వద్ద ఫైర్ వాహనాలు లేవు” అని అధికారులు చెప్పినట్లు రైతులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు వంద ధాన్యం బస్తాలు దగ్ధమయ్యాయని, లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి రాకపోతే ఇంకా పెద్ద ఎత్తున ధాన్యం నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయ వ్యర్థాలకు నిప్పు.. కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలు దగ్ధం