ప్రభుత్వ బడులు అందంగా కనిపిస్తున్నాయి.. అందులో విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందుతున్నాయి.. ఇక వసతుల విషయానికొస్తే ‘కార్పొరేట్’కు దీటుగా ఉన్నాయి. ఆంగ్లమాద్యమంలో విద్యాబోధన కొనసాగుతున్నది. ప్రతిరోజూ స్కూలు నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు ఆంగ్లంలో మాట్లాడుకుంటుంటే తల్లిదండ్రులు చూసి మురిసిపోతున్నారు. తమ పిల్లలకు పరీక్షల్లో మంచి మార్కులు వస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యావ్యవస్థపై దృష్టి సారించి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న రాష్ట్ర సర్కార్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. ‘మన ఊరు/బస్తీ- మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల రూపురేఖలే మారిపోతున్నాయి. దీంతో ప్రభుత్వ బడుల్లో ఏటికేడు విద్యార్థుల హాజరు శాతం పెరుగుతున్నది. ఇల్లెందు మండలంలో 22 బడులు ఎంపిక కాగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇల్లెందు రూరల్, అక్టోబర్ 30: ఇల్లెందు మండలంలోని 29 పంచాయతీల పరిధిలో 30 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఇల్లెందు పట్టణంలోని ఎనిమిది పాఠశాలలు, మండల వ్యాప్తంగా 22 పాఠశాలలు ‘మన ఊరు- మన బడి’కి ఎంపికయ్యాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేయనున్న నేపథ్యంలో సర్కార్ పాఠశాలలను బలోపేతం చేస్తున్నది. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. తరగతి గదులు, మరుగుదొడ్లకు మరమ్మతులు చేపడుతున్నారు. నీటి వసతి కల్పిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధనపై ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి చేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నారు. ఇప్పటికే సర్కార్ పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం, ఏటా యూనిఫాం అందుతున్నది. నీళ్ల సాంబారు, ఉడికీ ఉడకని పప్పు, పురుగులు పట్టిన బియ్యానికి రోజులు పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్నది. ఆహారంలో ఆకుకూరలు, గుడ్లు, పప్పు, కూరగాయలు, వారంలో ఒకసారి ఉండేలా మోనూ పాటిస్తున్నది.
కేసీఆర్ సార్‌కు ధన్యవాదాలు
మా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. పరీక్షల్లో మంచి మార్కులు వస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమయ్యాయి. పిల్లలకు నాణ్యమైన విద్య అందుతున్నది. మధ్యాహ్న భోజన పథకంలో పక్కాగా మెనూ అమలవుతున్నది. సంజయ్‌నగర్ పాఠశాలలో విద్యార్థులకు నీటి వసతి, మరుగుదొడ్డి వసతి ఉన్నది.
– ప్రతిభ, విద్యార్థి తల్లి, సంజయ్‌నగర్
మా పిల్లలు ఆంగ్లంలో మాట్లాడుతున్నారు
సంజయ్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో మా పాప 4వ తరగతి, బాబు 2వ తరగతి చదువుతున్నారు. ప్రతిరోజూ స్కూలు నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు ఆంగ్లంలో మాట్లాడుకుంటుంటే సంతోషంగా ఉంది. సర్కార్ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యాబోధన అందుతున్నది. విద్యావ్యవస్థపై దృష్టి సారించి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న సర్కార్‌కు కృతజ్ఞతలు.
– శిరీష, విద్యార్థి తల్లి, సంజయ్‌నగర్
హాజరుశాతం పెరుగుతున్నది
ప్రభుత్వ బడుల్లో ఏటికేడు విద్యార్థుల హాజరు శాతం పెరుగుతున్నది. ‘మన ఊరు – మన బడి’తో సర్కార్ పాఠశాలలు బలోపేతం అవుతున్నాయి. ప్రభుత్వం విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తున్నది. వచ్చే సంవత్సరం నుంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగనున్నది. ఇప్పటికే వారంలో రెండు రోజులు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో విద్యాప్రమాణాలు అమలుచేస్తున్నది.
– పిల్లి శ్రీనివాస్, ఎంఈవో, ఇల్లెందు
చల్లసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
చేతులు శుభ్రం చేసుకునేందుకు నిరంతరం నీటి సౌకర్యం