మధిర, ఆగస్టు 29 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కొనుగోలు చేసిన ట్రాక్టర్లకు కిస్తీలు చెల్లించకపోవడంతో షూరిటీగా ఉన్న మాజీ ఉప సర్పంచ్ బ్యాంక్ ఖాతాను అధికారులు హోల్డ్‌లో పెట్టారు. ఖమ్మం జిల్లా మధిర మండలం తొండల గోపారం గ్రామ పంచాయతీ కోసం అప్పటి ప్రభుత్వం ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి, బాధ్యత గ్రామ పంచాయతీలకు అప్పగించింది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కొనుగోలుకు అప్పటి గ్రామ ఉప సర్పంచ్ చేబ్రోలు రాజేశ్వరి షురిటీ సంతకం చేశారు. ప్రభుత్వం మారడంతో ట్రాక్టర్ కొనుగోళ్లకు నిధులు చెల్లించకపోవడంతో కిస్తీలు పెండింగ్‌లో పడ్డాయి.
గత 9 నెలలుగా కిస్తీలు గ్రామ పంచాయతీ చెల్లించడం లేదు. ఈ కారణంగా మధిర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు షూరిటీగా ఉన్న మాజీ ఉప సర్పంచ్ చేబ్రోలు రాజేశ్వరి వ్యక్తిగత అకౌంట్‌ను హోల్డ్ లో పెట్టారు. ఈ విషయమై అడుగగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తాలూకా కిస్తీలు చెల్లించనందువల్ల అకౌంట్‌ను హోల్డ్‌లో పెట్టడం జరిగిందని బ్రాంచ్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ తెలిపారు. తమ పదవీకాలం ముగిసిందని, అకౌంట్లో ఉన్న డబ్బులు పిల్లల చదువు, అత్యవసరాల కోసమని చెప్పి హోల్డ్ నుండి తొలగించాలని కోరగా.. సదరు మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ మీ ఆధార్ కార్డుపై ఎన్ని ఖాతాలు ఉంటే అన్ని ఖాతాలను హోల్డ్ లో పెడతామని తెలిపినట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో తమకు సంబంధం లేదని, నిధులు వస్తాయో రావో తెలియదని, కిస్తీలు చెల్లిస్తే అప్పుడు అకౌంట్‌ను హోల్డ్ నుండి తొలగిస్తామని తెలిపినట్లుగా ఆమె వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడంలో విఫలం కావడం, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని మండిపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు గ్రామ అభివృద్ధి కోసం సహకరించే వారికి శాపంగా మారిందన్నారు. తనకి జరిగిన అన్యాయంపై మాజీ ఉప సర్పంచ్ రాజేశ్వరి మధిర మండల పరిషత్ కార్యాలయం ఎదుట సిపిఎం నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మధిర మండల కార్యదర్శి మండల సైదులు మాట్లాడుతూ.. వెంటనే రాజ్యలక్ష్మి అకౌంట్‌ను హోల్డ్ నుండి తొలగించాలని, గ్రామ పంచాయతీ నుండి చెల్లించాల్సిన కిస్తీలను పంచాయతీ అధికారులు చెల్లించాలన్నారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే రాజ్యలక్ష్మి కుటుంబానికి అండగా సిపిఎం పోరాడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ఎర్రుపాలెం పార్టీ కార్యదర్శి మద్దాల ప్రభాకర్ పార్టీ, నాయకుడు ఎలిజాల గోపి పాల్గొన్నారు.