– గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు
కారేపల్లి, జనవరి 24 : గ్రామీణ వైద్యులకు పారా మెడికల్ బోర్డ్ ద్వారా మధ్యలో ఆగిన శిక్షణను తిరిగి ప్రారంభించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. కారేపల్లి మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఖమ్మం నగరంలో సంఘం 24వ మహాసభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సభకు జిల్లా మంత్రులు, శాశన సభ్యులు, రెండు జిల్లాల వైద్య శాఖ అధికారులు హాజరు కానున్నట్లు తెలపారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన గ్రామీణ వైద్యులు అంతా సమయ పాలన పాటించి భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్త గ్రామీణ వైద్యులకు అవకాశం కల్పించాలని, శిక్షణ పూర్తి అయిన వారికి సర్టిఫికేట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
గ్రామీణ వైద్యులకు శిక్షణ నిర్వహించడానికి ప్రభుత్వం వెంటనే బడ్జెట్ విడుదల చేయాలన్నారు. గ్రామీణ వైద్యులు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని సూచించారు. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సభ్యత్వం కలిగి, గుర్తింపు కార్డు ఉన్నవారి సమస్యలు మాత్రమే పరిష్కరించబడునన్నారు. గ్రామీణ వైద్యులకు డబుల్ బెడ్రూం ఇల్లు ప్రభుత్వం కట్టించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గ్రామీణ వైద్యులకు చట్టభద్రత కల్పించి ప్రభుత్వ వైద్య పథకాల్లో భాగస్వాములను చేయాలన్నారు. గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వెయ్యి మందికి ఒక గ్రామీణ వైద్యుడిని నియమించి గౌరవ వేతనం ఇవ్వాలన్నారు. గ్రామీణ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడులను వెంటనే నిలిపి వేయాలని, గ్రామీణ వైద్యులపై పెట్టిన కేసులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బేషరతుగా విరమించుకోవాలన్నారు.
తెలంగాణ హెల్త్ మినిష్టర్ రాజనరసింహ ఇటీవల శాసన మండలిలో మాట్లాడుతూ గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని, అదే మాటమీద కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతారపు వెంకటాచారి, సింగరేణి మండల అధ్యక్షుడు వీరయ్య చౌదరి, ఉపాధ్యక్షుడు సైదులు, ఆర్ఎంపీలు రఘు, నారాపోగు సుధర్షన్, గరిడేపల్లి వెంకటరామయ్య పాల్గొన్నారు.