కూసుమంచి, అక్టోబర్ 11: గ్రామాల్లో రాజకీయ నాయకులు ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఉండి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారథిగా ఉంటూ రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందేలా చూడాలని అన్నారు. కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సుమారు 10 గంటలపాటు నేలకొండపల్లి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో ముఖాముఖి అయ్యారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారాల కోసం సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అనంతరం గ్రామాల ముఖ్య నాయకులతో మాట్లాడి స్థానికంగా ఉన్న సమస్యల గురించి తెలుసుకున్నారు. తరువాత ఆయా శాఖల అధికారులతో మాట్లాడుతూ.. జటిలంగా ఉన్న సమస్యలపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లోని సమస్యలను గ్రామ కమిటీల ద్వారా పరిష్కరిస్తామన్నారు. నేలకొండపల్లి ఏఎంసీ చైర్మన్ వెన్నెపూసల సీతారాములు, మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.