మున్నేరుపై రిటైనింగ్ వాల్ నిర్మాణంలో కాంగ్రెస్ సర్కారు బలవంతపు చర్యలకు దిగుతోంది. వాల్ నిర్మాణంలో ఆస్తులు కోల్పోతున్న నిర్వాసితులతో సంప్రదింపులు లేకుండానే, భూసేకరణకు వారి సమ్మతి అక్కర్లేకుండానే రేవంత్ సర్కారు ముందుకు సాగుతోంది. నిర్వాసితులతో సమావేశాలు పెట్టి మాట్లాడింది లేదు.
ఫలానా పరిహారమిస్తామంటూ ముచ్చటించిందీ లేదు. పైగా భూములు ఇవ్వాల్సిందేనంటూ అధికారులతో హుకుంలు జారీ చేయిస్తోంది. బాధితులను గుర్తించి వారికి సలహాలివ్వడంగానీ, వారిని సమావేశాలకు పిలవడంగానీ చేయలేదు. వాల్ నిర్మించే ప్రాంతంలోని ఇళ్లను, భూములను గుర్తించడం, వాటిని తొలగించేందుకు మార్కింగ్ చేసుకుంటూ వెళ్లడం మినహా మరోమాట లేకుండా ముందుకు సాగుతోంది. దీంతో బాధితులందరూ లబోదిబోమంటున్నారు.
-రఘునాథపాలెం, మే 8
రెక్కలు ముక్కలు చేసుకొని కూడబెట్టుకున్న కొద్దిపాటి ఆస్తి అయినా అది ఎంతో విలువైనది. తండ్రులు, తాతలు కూడా వారు పస్తులుండి మరీ కూడబెట్టిన తులమో, గజమో వారసత్వంగా తమ వారసులకు అందించి వెళ్తుంటారు. అది ఎన్నిరెట్లు విలువైనదైనప్పటికీ.. వారు దానిని తమ పూర్వీకుల జ్ఞాపకార్థంగా కాపాడుకుంటుంటారు. ఇంకొందరైతే.. తమ పిల్లల ఉన్నత చదువుల కోసం, వివాహాల కోసం, లేదంటే తమ కలల సాకారం కోసం ఒకపూట తిని, మరోపూట నీళ్లు తాగి పొలమో, జాగో పోగుచేసి ఉంటారు. కూడబెట్టుకున్న ఆ కొద్దిపాటి ఆస్తిపాస్తులపై ఎంతో అనుబంధాన్ని ఏర్పర్చుకుంటారు పేద, మధ్యతరగతి ప్రజలు.
ఇంతలా మమకారాన్ని పెంచుకున్న వారి ఆస్తిపాస్తులను అగ్గువకు లాగేసుకునేందుకు ఎవరు ప్రయత్నించినా వారు ఆగ్రహానికి గురవుతారు. ఉగ్రరూపం దాల్చుతారు. ఖమ్మం మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి భూములను తీసుకునే విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, అధికార యంత్రాంగం అనుసరిస్తున్న విధానాలపై ఆ పేద, మధ్య తరగతి ప్రజలు భగ్గుమంటున్నారు. పరిహారం ఎంతన్న విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని, తామిచ్చిందే పరిహారమన్నట్లుగా వ్యవహరిస్తోందని, రెవెన్యూ అధికారులేమో వాస్తవ పరిస్థితిని కలెక్టర్‌కు, ప్రభుత్వానికి చెప్పడం లేదని, ఇష్టమున్నా లేకున్నా ఇచ్చిన మొత్తాన్నే తీసుకోవాలంటున్నారని, అలా అయితే తాము కడుపు మాడ్చుకొని కూడబెట్టుకున్న ఆస్తిపాస్తులను కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏటా మున్నేటి ఉధృతికి దాని పరీవాహక ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. రెండేళ్ల క్రితం వరదలు కూడా విలతాండవం చేయడంతో అప్పటి కేసీఆర్ సర్కారు మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఈ ఏడాది వర్షాకాలంలో మళ్లీ మున్నేరు మహోగ్ర రూపం దాల్చి పరీవాహక ప్రాంతాలను ముంచెత్తడంతో అక్కడి ప్రజలందరూ కట్టుబట్టలతో బయటపడ్డారు. ఆస్తులు, ఇళ్లు కోల్పోయారు.
ఈ క్రమంలో గత కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు మొదలుపెట్టిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. భూసేకరణ విషయంలో పేదలు, మధ్య ప్రజలకు అన్యాయం చేస్తోంది. వాల్ నిర్మాణం కోసం విలువైన భూములు తీసుకుంటూ మార్కింగ్‌లు పెడుతూ ముందుకెళ్తున్న ప్రభుత్వం.. అందుకు ఇచ్చే పరిహారం ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో ఆయా భూములు, ప్లాట్లు కోల్పోతున్న నిర్వాసితులు లబోదిబోమంటున్నారు.
ఖమ్మంలో మున్నేరుకు రెండు వైపులా సుమారు 17.50 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం పనులను కొనసాగిస్తోంది. తొలుత ప్రభుత్వ భూములున్న ప్రాంతాల్లో అధికారులు పనులు చేపడుతున్నారు. కాగా, వాల్ నిర్మాణంలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు భూములు, ప్రైవేటు ప్లాట్లు, ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయి. 50 ఎకరాల మేరకు ప్రైవేటు భూములు, స్థలాలను తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు గుర్తించినట్లు తెలిసింది.
ప్రైవేటు ప్లాట్లు కలిగిన వాళ్లు, ఇళ్లు కట్టుకున్న వాళ్లు 250 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. అయితే భూములు, ప్లాట్ల నిర్వాసితులను గుర్తించిన అధికారులు.. వారికిచ్చే పరిహారంపై నేటికీ స్పష్టత ఇవ్వలేదు. నిర్వాసితులు అడిగినా అధికారులు ఖాతరు చేయడం లేదు. అయితే..
రిటైనింగ్ వాల్, కల్వర్టు, బఫర్ జోన్ పేరుతో తమ భూములను లాక్కుంటున్నారని, ప్రజా అవసరాల దృష్ట్యా ప్రభుత్వం చేపట్టే అభివృద్ధికి కార్యక్రమాలకు సహకరించినా, సహకరించకపోయినా భూములను తప్పక తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారని నిర్వాసితులు తలలు బాదుకుంటున్నారు. మున్నేరుకు ఆనుకొని ఎకరం విలువ రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లపైగానే మార్కెట్లో ఉన్నందున ఆ ప్రకారంగానే తమ భూములకు, ప్లాట్లకు పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. లేకుంటే స్థలాలు ఇవ్వబోమని స్పష్టం చేస్తున్నారు.
చావనైనా చస్తాం గానీ భూములివ్వం..
చావనైనా చస్తాం గానీ పరిహారం చెల్లించకుంటే భూములివ్వబోమని నిర్వాసితులు అధికారులకు తేల్చిచెప్పారు. ‘మా కుటుంబాలను వీధిన పడేస్తారా?’ అంటూ ప్రశ్నించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ బలవంతంగా లాక్కుంటే తామూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఎక్కడో ఓ చోట విలువైన భూములిస్తామంటే అంగీకరించబోమని అన్నారు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తేల్చిచెప్పారు. అయితే, ఇప్పటికే కొందరు ప్లాట్ల యజమానులు స్టే తెచ్చుకున్నట్లు తెలిసింది.
పోలేపల్లిలో ప్లాట్లిస్తామంటున్న అధికారులు
రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ప్లాట్లు, ఇండ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో ప్లాట్లు ఇస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే, విలువైన తమ భూములు తీసుకుంటూ అంతగా విలువ చేయని ఆ భూములను తమకెలా ఇస్తారని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.
మూడింతల పరిహారమిస్తేనే..
ప్రకాశ్‌నగర్‌లో మా తాతయ్య ద్వారా వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములను సాగు చేసుకుంటూ ఎన్నో ఏళ్లుగా బతుకుతున్నాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మిస్తూ మా భూములు తీసుకుంటోంది. రెవెన్యూ అధికారులు వచ్చి మా భూమిలో మార్కింగ్ చేశారు. ఇక్కడున్న మార్కెట్ విలువకు మూడింతల పరిహారం చెల్లిస్తేనే భూములిస్తాం. లేదంటే హైకోర్టును ఆశ్రయిస్తాం.
-ఆకిటి నవీన్, నిర్వాసితుడు, ప్రకాశ్‌నగర్