మహిళ ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం. ప్రతి ఇంట్లో ఆడవారు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు ఆనందంగా ఉంటుంది. అందుకే మహిళల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ‘ఆరోగ్య మహిళ’ కేంద్రాల పేరుతో ప్రతి మంగళవారం యుక్తవయస్సు నుంచి 60 ఏండ్ల మధ్య ఉన్న మహిళలకు ప్రత్యేక వైద్యపరీక్షలు చేస్తున్నారు. మార్చి నుంచి ఇప్పటివరకు 8,475 మందికి పరీక్షలు చేశారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో కొత్తగూడెం పరిధిలో పెనగడప, పినపాక పరిధిలో ఎంపీ బంజర, ఇల్లెందు పరిధిలో కొమరారం, భద్రాచలం పరిధిలో పర్ణశాల, అశ్వారావుపేట పరిధిలో ఎర్రగుంట పీహెచ్‌సీల్లో సేవలు అందిస్తున్నారు. పేదలకు వైద్యసేవలు ఉపయోగపడుతుండడంతో సంబురపడుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 19 (నమస్తే తెలంగాణ) : యుక్తవయస్సు నుంచి పెద్దవాళ్లదాకా ఆడవాళ్లను ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. వాటన్నింటి పరిష్కారం కోసం ఆమెకు అండగా సర్కారు ఆసుపత్రిలో ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో ‘ఆరోగ్య మహిళ’ పేరుతో ప్రతి మంగళవారం కేవలం మహిళలకు వైద్యసేవలు అందిస్తున్నారు. యుక్తవయస్సు నుంచి 60 ఏండ్ల మధ్య ఉన్న మహిళల కోసం సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ఈ ప్రత్యేక వైద్యసేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రతి మంగళవారం దూరప్రాంతాల నుంచి ‘ఆరోగ్య మహిళ’ కేంద్రాలకు వచ్చి పలురకాల వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలో పెనగడప, పినపాక పరిధిలో ఎంపీ బంజర, ఇల్లెందు పరిధిలో కొమరారం, భద్రాచలం పరిధిలో పర్ణశాల, అశ్వారావుపేట పరిధిలో ఎర్రగుంట పీహెచ్‌సీల్లో ‘ఆరోగ్య మహిళ’ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
క్యాన్సర్ నిర్ధారణ కోసం రేడియాలజీ హబ్
అన్ని జబ్బులు ఒక ఎత్తైయితే క్యాన్సర్ పేరు చెబితేనే మనిషి సగం అయ్యే పరిస్థితి. అలాంటి పెద్ద జబ్బులకు కూడా సర్కారు నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ఆరోగ్య మహిళ కేంద్రాల్లో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను చేస్తున్నారు. క్యాన్సర్ పరీక్షలు చేసేందుకు మామోగ్రామ్ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం కొత్తగూడెం జిల్లాకేంద్రంలో రేడియాలజీ హబ్‌లో ఈ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు. ఇప్పటికే చాలామంది అనుమానితులను గుర్తించి మామోగ్రామ్ చేయించారు. కానీ ఇంతవరకు ఎవరికీ లక్షణాలు తేలలేదు. భవిష్యత్‌లో ఎవరికి వచ్చినా ముందస్తుగా తెలుసుకుని మందులు వాడితే ఎంతపెద్ద జబ్బైనా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు వచ్చే ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్‌ను గుర్తిస్తారు.
ప్రతి మంగళవారం ప్రత్యేక పరీక్షలు
ముఖ్యంగా మహిళలకు సంబంధించిన వ్యాధులకు ప్రత్యేక పరీక్షలు చేసేందుకు ప్రతి మంగళవారం స్క్రీనింగ్ చేస్తున్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, గుండె, రుతు సంబంధించిన వ్యాధులకు పరీక్షలు చేస్తున్నారు. దీంతోపాటు కొత్తగా మిటమిన్ బీ-12, విటమిన్- డీ పరీక్షలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా యుక్త వయస్సు బాలికలు వారి సమస్యలను చెప్పుకోకపోవడం వల్ల పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అటువంటి వారికి ఆరోగ్య మహిళ కేంద్రాల్లో సేవలు చాలా ఉపయోగపడుతున్నాయి. ఇందుకోసం వైద్యులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. అందులో పనిచేసే నర్సులకు కూడా ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. నెలకొకసారి అందరికి పరీక్షలపై అవగాహన కూడా కల్పిస్తున్నారు.
అనారోగ్య సమస్య ఏదైనా చెప్పుకోవచ్చు
మగవాళ్లు ఉన్న ఆసుపత్రికి వెళ్లాలంటే అందరు వెళ్లలేరు. ప్రభుత్వం మంచి పని చేసింది. ఆడోళ్లకి మాత్రమే మంగళవారం పెట్టారు. అనారోగ్య సమస్య చెప్పుకుంటే వచ్చిన జబ్బు వెంటనే తగ్గే అవకాశం ఉంటది. అన్ని పరీక్షలు చేస్తున్నారు. పెద్దజబ్బుకు కూడా పరీక్షలు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. డాక్టరమ్మ బాగా చూస్తున్నది. పిల్లలను కూడా తీసుకొస్తున్నాం.
– రాంబాయి, చండ్రుగుంట, చుంచుపల్లి మండలం
8,475 మందికి పరీక్షలు చేశాం..
మార్చి 8వ తేదీన ఆరోగ్య మహిళ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి ఇప్పటివరకు 8,475 మందికి పరీక్షలు చేశాము. ఇందులో 318 మందిని పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేశాం. జిల్లాకేంద్రంలో రేడియాలజీ హబ్ ప్రారంభించాం. మామోగ్రామ్, సిటీ స్కాన్, టుడీ ఏకో కూడా ఉంది. జిల్లాలోని ఐదు పీహెచ్‌సీల్లోనూ ప్రతి మంగళవారం వందకు తగ్గకుండా రోగులు వస్తున్నారు.
– డాక్టర్ శిరీష, డీఎంహెచ్‌వో, భద్రాద్రి కొత్తగూడెం
మాకు ఒక ఆసుపత్రి వచ్చింది
అప్పుడు ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రైవేటుకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆడవాళ్ల కోసం ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. సౌకర్యాలు బాగా ఉన్నాయి. అన్ని పరీక్షలు ఇక్కడే చేస్తున్నారు. లేడీ డాక్టర్ ఉన్నారు. ఎలాంటి భయం లేదు. సమస్యను మంచిగా చెప్పుకునే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న ఆడవాళ్లమంతా ఎలాంటి సమస్య ఉన్నా పరీక్షలు చేపించుకుంటున్నాము. ఖరీదైన మందులు కూడా ఉన్నాయి. పరీక్షలు ఉండడం వల్ల ఎలాంటి జబ్బయినా ముందే తెలుసుకోవచ్చు.
– లావణ్య, గౌతంపూర్, చుంచుపల్లి మండలం
వారంలో వందమంది వస్తున్నారు
ప్రతి రోజూ ఇతరులను కూడా చూస్తాము. మంగళవారం మాత్రం కేవలం ఆడవాళ్లకి పరీక్షలు చేస్తున్నాం. 18 నుంచి 60 సంవత్సరాల వాళ్లందరూ వస్తున్నారు. వారికి ఆరోగ్య మహిళ కార్డును ఇస్తున్నాం. ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. క్యాన్సర్ అని అనుమానం వస్తే పరీక్షకు పంపిస్తున్నాము. ఇంతవరకు పెనగడపలో అలాంటి కేసులు రాలేదు. చాలామందిలో పిరియడ్స్, పిల్లలు పుట్టకపోవడం వంటి సమస్యలను గుర్తించాం.
– నేహా అమ్రీన్, వైద్యురాలు, పెనగడప పీహెచ్సీ