భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాలోని సర్కార్ దవాఖానల్లో సమస్యలు ఎక్కడ వేసినా గొంగడి అక్కడే.. అన్న చందంగా తిష్ఠ వేశాయి. ఒక ఆసుపత్రిలో వైద్యుల కొరత వేధిస్తుంటే.. మరో ఆసుపత్రిలో వసతులు అరకొర.. ఇంకో ఆసుపత్రిలో ఏకంగా మాతాశిశు మరణాలు.. వెరసి ప్రభుత్వ దవాఖానలు నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో వందశాతం విఫలం.
కొత్తగూడెంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. ఆసుపత్రిలో ఏ విభాగానికి వెళ్లినా దుర్గంధం వెదజల్లుతున్నది. ఆసుపత్రికి వచ్చిన ప్రజలు ముక్కు మూసుకుని వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఆసుపత్రి ఆవరణలో మురుగు ప్రవాహిస్తుండడం గమనార్హం. ఆసుపత్రిలో తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన ట్యాంక్‌ల నుంచి చుక్కనీరు కూడా రాకపోవడం విచారకరం. ఇక మరుగుదొడ్లయితే ఎప్పుడూ తెరిచి ఉండవు. కొత్తగూడెం జిల్లా ప్రధాన ఆసుపత్రికి అనుసంధానమైన రామవరం మాతాశిశు కేంద్రంలో ఇటీవల మాతాశిశు మరణం సంభవించినా వైద్యులు, సిబ్బంది పనితీరులో ఎలాంటి మార్పులేదని ఆసుపత్రికి వచ్చిన గర్భిణులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అనేకసార్లు కలెక్టర్‌కు అనేకసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. కలెక్టర్ ప్రియాంక ఆల రెండు మూడుసార్లు ఆసుపత్రిని సందర్శించి వైద్యాధికారులు, సిబ్బందిని హెచ్చరించినా వారిలో మార్పు లేదు.
బూర్గంపాడులో ఇప్పటికీ పురాతన భవనంలోనే పీహెచ్సీ నడుస్తున్నది. అరకొర వసతుల మధ్యే ప్రజలు అక్కడ వైద్యసాయం పొందుతున్నారు. అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో కనీసం ఒక అంబులెన్స్ అయినా అందుబాటులో లేకపోవడం గమనార్హం. అలాగే జిల్లాలోని ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లో రోగులకు సరైన వసతుల్లేవని, బెడ్లు సరిపోయినన్నీ ఉంటే వారికి మెరుగైన సేవలు అందుతాయని ఇటీవల జరిగిన జడ్పీ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇంత అలసత్వం ఉన్నా వైద్యారోగ్యశాఖ పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేరుకే జిల్లా ప్రధాన ఆసుపత్రి. కానీ ఆసుపత్రిలో అన్నీ సమస్యలే. వైద్యం కోసం హాస్పిటల్‌కు వచ్చిన వారికి సరైన మెడిసిన్ అందడం లేదు. బ్లడ్ శాంపిల్స్ తీయడానికి కనీసం కిట్లు లేకపోవడం బాధాకరం. వైద్యులు సమయ పాలన పాటించడం లేదు. ఆసుపత్రి పరిధిలో పారిశుధ్య చర్యలు సరిగా లేవు. ఆస్పత్రిలో ఎక్కడికి వెళ్లినా దుర్గంధమే.
– దూడల బుచ్చయ్య, మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్, కొత్తగూడెం