ఖమ్మం సిటీ, జూలై 6: ఖమ్మం వ్యాప్తంగా పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. పారిశుధ్య పనుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో ఖమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు.
లేదంటే ఈగలు, దోమలు వృద్ధి చెంది ప్రజలు విష జ్వరాల భారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే ఖమ్మం నగరంలోని అన్ని ప్రధాన మురుగు కాల్వలను శుభ్రం చేయాల్సి ఉందని అన్నారు. కానీ మంత్రులు, ఉన్నతాధికారులు, మున్సిపల్ అధికారులు అంతా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తద్వారా అన్ని డివిజన్లలో మురుగు పేరుకు పోయిందని ఆరోపించారు. తక్షణమే స్పందించి ప్రజలను దుర్భర పరిస్థితుల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు.