ఖమ్మం, ఏప్రిల్ 25: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే తమ సత్తా ఏమిటో సీఎం రేవంత్‌రెడ్డికి చూపించాల్సి వస్తుందని టీజీఈ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. అధికారంలోకి వచ్చి 16 నెలలైనా మంత్రుల పేషీల్లో ఇప్పటికీ ఉద్యోగ సంఘ నాయకులను గుర్తించడం లేదని, దీనిని బట్టి ఉద్యోగ సంఘాలపై ఎంత చిన్నచూపు ఉందో ఇట్టే అర్థమవుతోందని అన్నారు. అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం అంబేదర్ సెంటర్ అంబేదర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సదస్సులోనూ, అంతకుముందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలోనూ మారం, ఏలూరి మాట్లాడారు. రాష్ట్రంలో ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, గతంలో ఎప్పుడూ ఇలా పెండింగ్‌లో లేవని అన్నారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల బకాయిలు నెలకు రూ.650 కోట్ల చొప్పున చెల్లిస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విదల్చలేదన్నారు.
పీఆర్సీ నివేదికను తక్షణమే అమలు చేయాలని, జీతాల సవరణ కోసం 50 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మే 4న రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. సదస్సులో జేఏసీ బాధ్యులు, వివిధ సంఘాల నాయకులు తిరుపతి, గుంటుపల్లి శ్రీనివాసరావు, కస్తాల సత్యనారాయణ, యలమద్ది వెంకటేశ్వర్లు, తుంబూరు సునీల్‌రెడ్డి, కొణిదెన శ్రీనివాస్, మోదుగు వేలాద్రి, పారుపల్లి నాగేశ్వరరావు, దేవరకొండ సైదులు, మామునూరి రాజేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.