బోనకల్లు, ఏప్రిల్ 04 : రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ అన్నారు. శుక్రవారం బోనకల్లులో టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడు చిన్న రంగారావు అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యా విధానాల్లో మార్పు తేవడం వల్ల బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి రెండో వేతన సవరణ సంఘం రిపోర్టును వెంటనే తెప్పించాలన్నారు. 2023 జులై నుండి నూతన పీఆర్సీ అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెప్తూ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు ఇంకా క్లియర్ చేయకపోవడం దారుణమన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 5 డీఏలు పెండింగ్లో ఉండటం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా నాయకులు సద్దాబాబు, మండల ఉపాధ్యక్షురాలు సౌభాగ్య లక్ష్మి, మండల నాయకులు పి.నరసింహరావు, ఎన్.వెంకటేశ్వర్లు, ఎన్.నిర్మల కుమారి, నరేంద్ర సింహ, యూ.గంగాభవాని పాల్గొన్నారు.