
అపరాలు, నూనె గింజలకు మార్కెట్లో మంచి డిమాండ్
ఆయిల్ పాం సాగుకు జిల్లాలో అనుకూలమైన నేలలు
మిశ్రమ, అంతర పంటలతో ప్రయోజనాలు
ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 17: కేంద్ర సర్కార్ కర్షకుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. యాసంగిలో వడ్లు కొనేదిలేదని తేల్చి చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నదాతల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు బీజేపీ సర్కార్‌కు విన్నవించినా ససేమిరా అన్నది. దీంతో రైతులు వరి వేసి నష్టపోకుండా ఇతర పంటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నది. బీజేపీ నాయకుల మాటలు నమ్మి వరి సాగు చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని వ్యవసాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ఇతర పంటలు వేస్తే తక్కువ పెట్టుబడితో లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో జొన్న, మొక్కజొన్న, పెసర, మినుములు, కూరగాయలు, మిశ్రమ, అంతర పంటల సాగు రైతులకు లాభదాయకం. ఇప్పటికే ఈ పంటల సాగుపై వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు,తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విత్తనాలను సైతం సిద్ధం చేస్తున్నారు.
కేంద్రం ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేసిన నేపథ్యంలో రైతులు యాసంగిలో వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నది. ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు మొదలు కొని మైదానప్రాంతం వరకు ఏటా రెండు పంటలు వరి సాగే విస్తారంగా ఉంటుంది. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేసిన రైతులకు మున్ముందు ఇబ్బందులు తప్పవు. ఏ విధంగా చూసినా ఇతర పంటల సాగే మేలు. తక్కువ పెట్టుబడితో జొన్న, మొక్కజొన్న, పెసర, మినుములు, కూరగాయలు సాగు చేసి మంచి లాభాలను ఆర్జించవచ్చు. మిశ్రమ, అంతర పంటల సాగు రైతులకు లాభదాయకం. ఈ పంటల సాగుపై ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇతర పంటల సాగుకు తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విత్తనాలను సిద్ధం చేస్తున్నది.
అంతర పంటలతో ప్రయోజనాలు..
రాష్ట్రంలో సుమారు 60శాతం సాగు వర్షాధారమే. ప్రకృతి అనుకూలిస్తేనే పంటల దిగుబడి పెరుగుతుందనేది వాస్తవం. రైతులు వాణిజ్య పంటలపైనే ఆధారపడితే మున్ముందు ఎలాంటి అవరోధాన్నైనా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాలం కలిసి వస్తే ఫర్వా లేదు. ఒకవేళ ప్రతికూలిస్తే ఇబ్బందులు తప్పవు. రైతులకు అంతర పంటలతో బహుళ ప్రయోజనాలున్నాయి. రైతులు ఒకేసారి రెండు రకాల పంటలు సాగు చేసి లాభాలను ఆర్జించవచ్చు. వేర్వేరు పంటలు కావడంతో పోషకాల వినియోగమూ తక్కువగా ఉంటుంది. కలుపు మొక్కల బెడదకూ చెక్ పెట్టవచ్చు. నేలకోతను అరికట్టవచ్చు. భూసారాన్ని కాపాడుకోవచ్చు. పప్పు జాతి మొక్కల సాగుతో భూసారాన్ని మరింత పెంచవచ్చు. భూగర్భజలాలను సమర్థంగా వినియోగించుకోవచ్చు. ప్రధాన పంటలకు ఆశించే చీడ పీడలను అరికట్టవచ్చు. మిత్ర పురుగుల వృద్ధికి అంతర పంటలు ఎంతగానో ఉపయోగపడతాయి. సహజ వనరులైన నేల, నీరు, సూర్యరశ్మిని ఎక్కువ మొత్తంలో ఉపయోగించుకోవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో ఒక పంట చేజారినా మరో పంట చేతికి వచ్చే అవకాశం ఉన్నది. మిశ్రమ సాగు విధానం ఎల్లప్పుడూ క్షేమదాయకమే.
అపరాలు, నూనె గింజలకు డిమాండ్..
పత్తి సాగు విషయంలో రైతులు ఒకరిని చూసి మరొకరు, ఒక ఏడాది ధరలు బాగా ఉన్నాయని వచ్చే ఏడాది సాగు చేస్తున్నారు. దీంతో మార్కెట్లో డిమాండ్ తగ్గుతున్నది. రైతులు ప్రతి సీజన్లో వరితో పాటు వాణిజ్య పంటలనే సాగు చేస్తుండడంతో ప్రస్తుతం నూనెగింజలు, అపరాలకు డిమాండ్ పెరిగింది. రైతాంగం పునాస పంటలపై దృష్టి సారిస్తే మార్కెటింగ్ కష్టాలను అధిగమించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో పెసర, కంది ధరలు క్వింటాకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఉన్నాయి. ఐదేండ్ల క్రితం పప్పు ధాన్యాల ధరలు ఒక కిలోకు రూ.40 నుంచి రూ.50 పలికితే ప్రస్తుతం కిలో ఒక్కంటికి రూ.120 వరకు పలుకుతున్నాయి. వంట నూనెల ధరలు ఒక కిలోకు రూ.140 పైమాటే. జిల్లాలో నల్ల రేగడి, దుబ్బ నేలలు, ఎర్రమట్టి నేలలే ఎక్కువ. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు పెసర, మినుము, వేరుశనగ పంటల సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సత్తుపల్లి, కొణిజర్ల, కల్లూరు తదితర మండలాల్లోని భూములు ఆయిల్ పాం సాగుకు అనుకూలం. దీని సాగుకు ప్రభుత్వం రాయితీలనూ అందిస్తున్నది. ఆయిల్ ఫెడ్ ద్వారా ప్రభుత్వమే గెలలను కొనుగోలు చేస్తున్నది.
డిమాండ్ లేని పంటలు వద్దు..
ప్రస్తుతం వరి సాగుకు భవిష్యత్ లేదు. యాసంగిలో డిమాండ్ ఉండదు. ఇప్పటికే గిడ్డంగుల్లో ధాన్యపు నిల్వలు పేరుకుపోయాయి. వద్దు అని చెప్పిన పంట సాగు చేసి నష్టపోవడం కంటే రైతులు ఇతర పంటలు సాగు చేసే దిశగా ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా పంటలు సాగు చేస్తే మేలు.
వరి కంటే ఇతర పంటలతోనే లాభాలు..
కేంద్ర సర్కార్ వరి కొనుగోలుపై చేతులెత్తేసింది. రైతులు యాసంగిలో వరి సాగు చేస్తే ఇబ్బందుల పాలయ్యే ప్రమాదం ఉన్నది. ఇతర పంటలతో వరి కంటే ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చనే విషయాన్ని రైతాంగం గుర్తించాలి. అపరాలు, నూనెగింజలు, కూరగాయలు సాగు చేసి ఎంతో మంది మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో జొన్న, మక్కలు సాగు చేయొచ్చు. దిగిబడి వచ్చిన తర్వాత మార్కెటింగ్‌కు ఇబ్బందులు ఉండవు.