కారేపల్లి, ఏప్రిల్ 30 : సింగరేణి మండలం అప్పాయిగూడెం గోదాంను సింగరేణి మండల రైతుల పంట కోసమే వినియోగించాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. గురువారం అప్పాయిగూడెం గోదాంను వైరా ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్బంగా గోదాంలో పని చేస్తున్న హామాలీలు, ఇతర వర్కర్లతో మాట్లాడారు. అప్పాయిగూడెం గోదాంతో రైతులకు ఎంతో ఉపయోగంతో పాటు ఈ ప్రాంతంలోని 150 మందికి పైగా ఉపాధి దొరుకుతుందన్నారు. రైతుల సౌకర్యార్ధం అప్పాయిగూడెం గోదాంను పట్టుబట్టి తెరిపించినట్లు తెలిపారు. మండలంలోని మొక్కజొన్న పంట మొత్తం ఈ గోదాంకే వచ్చేలా చర్యలు తీసుకోవాలని సోసైటీ కార్యదర్శి బొల్లు హనుమంతరావు, తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లును ఆదేశించారు.
గోదాంకు సంబంధించి రోజు వారి పర్యవేక్షణ చేయాలని అప్పాయిగూడెం సర్పంచ్ దండు ప్రవీణ్, కార్యదర్శి కృష్ణవేణి, కాంగ్రెస్ నాయకులకు సూచించారు. గోదాంకు వెళ్లు రహదారి అధ్వానంగా ఉందని రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, కారేపల్లి సొసైటీ మాజీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, ఆరఐ జగదీశ్, డీసీసీ ఉపాధ్యక్షులు పగడాల మంజుల, నాయకులు పెద్దపోయిన ఉమాశంకర్, మాజీ సర్పంచ్ మాలోత్ కిషోర్, సర్పంచులు దండు ప్రవీణ్, బానోత్ హిరాలాల్, వీర ప్రతాప్, టోనీ, మేదరి రాజా, వాంకుడోత్ గాంధీ పాల్గొన్నారు.