– విద్యార్థుల సంఖ్య పెంపుపై ఉపాధ్యాయులతో ఖమ్మం చైర్పర్సన్ మున్సిపల్ చైర్మన్, కమిషనర్ సమీక్ష
ఖమ్మం రూరల్, జూలై 13 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడంతో పాటు, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తని అనిత, కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సోమవారం చిన్న తండా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాఠశాలల ప్రస్తుత పరిస్థితి, విద్యార్థుల నమోదు, మౌలిక వసతులు, బోధన ప్రమాణాలపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించి ఎక్కువ మంది విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించేలా కృషి చేయాలని సూచించారు.
ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, నైపుణ్యాధారిత బోధన, డిజిటల్ విద్య వంటి సౌకర్యాలను ప్రజలకు వివరించాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యార్థుల హాజరు శాతం పెంచడం, పాఠశాలల పరిశుభ్రత, పచ్చదనం, తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదుల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించే వినూత్న కార్యక్రమాలను చేపట్టాలని, ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు బానోత్ భాస్కర్, బుర్ర మహేష్, బానోత్ నాగేంద్రప్రసాద్, బానోత్ దివ్య, కడవ నవీన్, హెచ్ఎం రామ చంద్రు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.