ఇల్లెందు రూరల్, అక్టోబర్ 27: ఇల్లెందు ఏరియా జేకే 5 ఓసీ ఫైవ్‌స్టార్ రేటింగ్‌కు ఎంపికైంది. ఏరియాకు గుండెకాయ లాంటి జేకే ఓసీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అనుభవజ్ఞలైన సూపర్వైజర్లు, శ్రమించి కష్టపడే ఉద్యోగులు, సూచనలు ఇచ్చే అధికారులు.. ఇలా ఏ ఒక్కరూ కూడా వెనుకడుగు వేయకుండా దేశంలోనే ఇల్లెందు ఏరియా పేరును మార్మోగించారు. కోలిండియా, సింగరేణి, ప్రభుత్వ, ప్రైవేట్ భూగర్భ ఉపరితల గనులకు సంబంధించి దేశ వ్యాప్తంగా 380 గనులు దరఖాస్తు చేసుకోగా.. తెలంగాణ నుంచి ఇల్లెందు ఏరియా జేకే 5 ఓసీ.. ఫైవ్‌స్టార్ రేటింగ్‌కు ఎంపికైంది.
ప్రమాదరహిత గనుల్లో మేలైన వాటికే తిరిగి ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇస్తారు. అదే విధంగా రామగుండం ఆర్జీవోసీ-1 కూడా ఎంపికైంది. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఇల్లెందు తరఫున ఏరియా జీఎం జాన్ ఆనంద్ ఫైవ్‌స్టార్ రేటింగ్ అవార్డును అందుకున్నారు. గత 12 ఏళ్లుగా జేకే 5 ఓసీ బొగ్గు ఉత్పత్తిని సాధిస్తూ ఏరియా కీర్తిని ఇనుమడింపజేసింది. సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ అంచెలంచెలుగా ఎదిగింది.
2021-22లో 30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 24.97 లక్షల టన్నులు, 2022-23లో 14.50 లక్షల టన్నుల లక్ష్యానికిగాను 18.79 లక్షల టన్నుల చొప్పున జేకే 5 ఓసీ ఉత్పత్తి సాధించి ఏరియా సత్తాను చాటింది. ప్రస్తుతం ఈ సంవత్సరంలో ఇచ్చిన 6 లక్షల టన్నులకు గాను 2 లక్షల టన్నులను ఉత్పత్తి చేసింది. మిగతా సమయంలో సంస్ధ నిర్దేశించిన లక్ష్యానికంటే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు జేకే 5 ఓసీ సూపర్వైజర్లు, అధికారులు, ఉద్యోగులు నిరంతరం కృషి చేస్తున్నారు.
వచ్చే ఏడాది మార్చి వరకు ఓసీ కాలపరిమితి ముగియడంతో జల విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటుచేసే అవకాశం ఉంది. సింగరేణి ప్రయోగాత్మకంగా రూపొందించే జల విద్యుత్ ప్లాంట్ నిర్మాణం ఇల్లెందులో తొలిసారిగా ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. జేకే 5 ఓసీకి ఫైవ్‌స్టార్ రేటింగ్ రావడంతో ఏరియా కార్మికులు, అధికారులు జిల్లా ప్రముఖుల ప్రశంసలను అందుకుంటున్నారు. కాగా, కాలపరిమితి వచ్చే సంవత్సరం ముగియడంతో పూసపల్లి ఓసీతో నూతన ఉపరితల గని ఏర్పాటు చేసి ఇల్లెందుకు మనుగడను కాపాడే దిశగా సింగరేణి అధికారులు ముందుకు సాగుతున్నారు. అనుకున్న సమయానికి నూతన ఓసీ ఏర్పాటైతే మరో 12 ఏళ్లపాటు ఎలాంటి ఢోకా లేకుండా బొగ్గు ఉత్పత్తి కొనసాగనుంది.