మధిర, అక్టోబర్ 24 : మధిర అసెంబ్లీ అభ్యర్థిగా మూడుసార్లు గెలిచిన మల్లు భట్టివిక్రమార్క ప్రజలను పట్టించుకోలేదని, ఒక్కసారి గెలిపించండి ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తానని మధిర బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. మంగళవారం పట్టణంలో పలువురు ప్రముఖులు, వ్యాపారులను కలుసుకొని ఆశీర్వచనం పొందుతూ తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా మధిర ప్రజాలతో కలిసి మెలిసి ఉంటున్నానన్నారు. ఎన్నికల సమయంలో కాకుండా ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేయడం జరిగిందన్నారు. కోట్లాది రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడ్డానని వివరించారు.
మూడుసార్లు ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ప్రజలకు దూరమై సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాడన్నారు. జరగబోయే ఎన్నికలు కారు గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా ఉంటానన్నారు. ప్రభుత్వ పథకాలను మరింత చేరువయ్యేలా బాధ్యతగా వ్యవహరిస్తానని, నిస్వార్థంగా ప్రజల కోసమే పనిచేస్తానని ఆయన వారికి వివరించారు. అనంతరం ఆయన పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో బిక్కి కృష్ణప్రసాద్, అరిగె శ్రీనివాసరావు, బీ.వెంకటేశ్వరరావు, శీలం వెంకటరెడ్డి, కరివేద సుధాకర్, కనుమూరి వెంకటేశ్వరరావు, ఎ.వీ.రెడ్డి పాల్గొన్నారు.