ఇల్లెందు, జనవరి 6 : పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జీసీసీ హమాలీలు చేపట్టిన సమ్మెకు పలు సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. ఇల్లెందులో జీసీసీ గిడ్డంగి-1 ఎదుట హమాలీలు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి నాల్గవ రోజుకు చేరింది. సమ్మెకు ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ, తెలంగాణ ప్రగతిశీల హమాలీ అండ్ మిల్ వర్కర్స్ ఫెడరేషన్ సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు కొక్కు సారంగపాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ రసుద్దీన్, జిల్లా అధ్యక్షుడు తోడేటి నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు.
సివిల్ సైప్లె, జీసీసీలో పనిచేసే హమాలీ కార్మికులకు పెరిగిన వేతనాలను ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం పెరిగిన వేతనాలను వెంటనే చెల్లించాలని, లేదంటే ఐక్యంగా సమ్మెను ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు సింగారపు శ్రీనివాస్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. హమాలీల సమ్మెకు తమ మద్దతు కూడా తెలుపుతున్నట్లు ఏఐటీయుసీ డివిజన్ కార్యదర్శి ఎండి.నజీర్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు.
దమ్మపేట, జనవరి 6 : జీసీసీ హమాలీ కార్మికులు నాల్గవ రోజు సమ్మెలో భాగంగా మేస్త్రీ భోగి సత్యం ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని కలెక్టరేట్ ముట్టడికి సోమవారం తరలివెళ్లారు. కలెక్టరేట్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపారు. కార్యక్రమంలో హమాలీ కార్మికులు ప్రసాద్, వెంకట్, నరసయ్య, సత్యనారాయణరాజు, మణికంఠ, కోట సుబ్బారావు, పోలయ్య, కొండా రాజు, కందుకూరి వీర్రాజు, పాలడుగు రామారావు, కామినేని రమేశ్, చెన్నారావు, రొయ్యల ప్రసాద్, వెంకటయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.