ఖమ్మం, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ఏడు విడతలుగా హరితహారాన్ని అమలు చేసి రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటించింది. ఇదే ఒరవడి కొనసాగించేందుకు, హరితహారానికి ఆర్థిక ఆలంబన కల్పించేందుకు హరితనిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హరితహారం లక్ష్యాలను వందశాతం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే నెల నుంచి హరితనిధికి సొమ్ముల సేకరణ ప్రారంభంకానున్నది.
ఖమ్మం జిల్లాలో 589 పంచాయతీలు, మూడు మున్సిపాలిటీలు, ఒక నగరపాలకసంస్థ ఉండగా భద్రాద్రి జిల్లాలో 481 గ్రామ పంచాయతీలు, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఏటా హరితహారంలో భాగంగా లక్షలాది మొక్కలు నాటాల్సి ఉన్నది. హరితనిధి ద్వారా అందిన సొమ్మును ప్రభుత్వం మొక్కల సంరక్షణకు వినియోగించనున్నది. మొక్కలను పశువుల బారిన పడకుండా ట్రీగార్డులు, ఏపుగా పెరగడానికి వెదురుకర్రలు కట్టడంతో పాటు ఇతర మొక్కల సంరక్షణ పనులకు వెచ్చించనున్నది. హరితనిధి సేకరణలో ప్రతిఒక్కరినీ భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఎంపీ స్థాయి నుంచి గ్రామస్థాయిలో సర్పంచ్ వరకు, కలెక్టర్ నుంచి గ్రామస్తాయిలో చిరుద్యోగి వరకు ప్రతిఒక్కరి నెలవారీ వేతనం నుంచి హరితనిధి కోసం కొంత సొమ్మును సేకరిస్తున్నది.
శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు వారి గౌరవవేతనంలో ఏడాదికి రూ.6వేలు, ఆలిండియా సర్వీసులో పని చేస్తున్న ఉద్యోగులు, చైర్మన్లు రూ.1200, మున్సిపల్ చైర్మన్లు రూ.600, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, మునిసిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు రూ.120 చొప్పున హరిత నిధిలో జమ చేయాల్సి ఉంది. గ్రామాఅభివృద్ధి, పట్టణాభివృద్ధికి ప్రభుత్వం కేటాయించే నిధుల్లో పదిశాతం, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 10శాతం జమ చేయాల్సి ఉంది. కొత్తగా వ్యాపారం చేయడానికి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలనుకున్నా, ఉన్న లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకోవాలనుకున్నా రూ.వెయ్యి హరితనిధి చెల్లించాల్సిఉంది. రాష్ట్ర పరిధిలోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాల్లో ప్రతి సంవత్సరం రూ.300 చొప్పున జమ చేయాల్సి ఉంది. ఇంజినీరింగ్ విభాగంలో కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లింపు సమయంలో 0.01శాతం, తహసీల్దారు కార్యాలయంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి రిజిస్ట్రేషన్‌పై రూ.50 చొప్పున అదనంగా హరితనిధికి చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలు పొందే పాఠశాల విద్యార్థి రూ.10. ఇంటర్మీడియట్ విద్యార్థి రూ.15, డిగ్రీ విద్యార్థి నుంచి రూ.25 వసూలు చేసి యాజమాన్యాలు హరితనిధికి జమ చేయాలి. మే నెల నుంచి ప్రారంభం కానున్న హరితనిధి సొమ్మును జూన్‌లో జరిగే హరితహారం కార్యక్రమానికి వినియోగించనున్నారు. ఇప్పటికే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న ఒక్కో లావాదేవీకి వినియోగదారులు రూ.50 చొప్పున హరితనిధికి చెల్లిస్తున్నారు.