సత్తుపల్లి టౌన్/ పెనుబల్లి, డిసెంబర్ 22: సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎస్డీఎఫ్ నుంచి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు, లంకాసాగర్ ప్రాజెక్టుల ఆధునీకరణ ఎన్టీఆర్ కాలువ మరమ్మతులు, సత్తుపల్లి నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలకు, తల్లాడ నుంచి కొడవటిమెట్టకు, బస్వాపురం నుంచి పెద్దకోరుకొండికి, చిన్నకోరుకొండి నుంచి ఆర్లపాడుకు, గణేవ్పాడు నుంచి గంగదేవిపాడుకు ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణాలకు, పంచాయతీరాజ్ శాఖ నుంచి లింక్ రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించారు.
ఏపీ యాదవ సంఘం మద్దతు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో దేశ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు ఏర్పాటైన బీఆర్ఎస్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం సంఘీభావం తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం చైర్మన్ రామకృష్ణయాదవ్ గురువారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి మద్దతు ప్రకటించారు.
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సమక్షంలో తన మిత్రులతో ప్రగతిభవన్‌కు వెళ్లిన రామకృష్ణ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని అప్యాయంగా పలుకరించి బీఆర్ఎస్ ఏర్పాటు ఆవశ్యకత గురించి వివరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెనుబల్లి జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.