రఘునాథపాలెం, ఆగస్టు 13 : గడువు ముగుస్తున్నా రేషన్ బియ్యం దుకాణాలకు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరఫరా కాకపోవడంతో డీలర్లు నిరసనకు దిగారు. నిబంధనల ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు బియ్యం పంపిణీ జరుగుతుండగా.. రెండు నెలలుగా బియ్యం సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లావ్యాప్తంగా 150 రేషన్ షాపులకు పైగా బియ్యం సరఫరా చేయకపోవడంతో జిల్లా రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీలర్లు ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ ఎంఎల్ఎస్ పాయింట్ల ఎదుట మంగళవారం బైఠాయించారు. బియ్యం పంపిణీ విషయంలో సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో గుత్తేదారు ఆడిందే ఆటగా సాగుతోందని మండిపడ్డారు.
ఉద్దేశపూర్వకంగానే ఒకటి రెండు లారీల లోడ్లు మాత్రమే ఎంఎల్ఎస్ పాయింట్లకు తీసుకరావడం.. వచ్చిన లోడ్లను ఒకరిద్దరు డీలర్లకు సరఫరా చేస్తున్నారని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకన్న ఆరోపించారు. బియ్యం కోసం నిత్యం డీలర్లు ఎంఎల్ఎస్ పాయింట్లకు వెళ్లడం.. అక్కడి ఇన్చార్జి లోడ్లు రాలేదని చెబుతుండడంతో చేసేది లేక ఇంటిబాట పడుతున్నారు.
ఇదంతా నిత్యకృత్యంగా మారడంతో విసుగెత్తిన డీలర్లు మంగళవారం గోదాం వద్దకు వచ్చిన రెండు లోడ్ల బియ్యం సరఫరా జరగకుండా అడ్డుకున్నారు. అనంతరం డీలర్లందరూ ఐక్యమై ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ధర్నాలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జానీమియా, ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు ఇబ్రహీం, మహేశ్, పాపారావు, బాబు, మురళీ, ఖాజామియా, గాజుల భద్రయ్య, జానీమియా పాల్గొన్నారు.
నిత్యం కార్డుదారుల ప్రదక్షిణలు
నిబంధనల ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తారు. ఒకటో తేదీన ఈ-పాస్ మిషన్ ద్వారా ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో డీలర్లు నిత్యం అందుబాటులో ఉండి వినియోగదారులకు బియ్యం అందజేస్తారు.
అంటే.. అంతకు ముందుగానే రేషన్ షాపులకు బియ్యం సరఫరా జరిగితే ఒకటో తేదీ నుంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేపట్టడం సాధ్యమవుతుంది. కానీ.. రేషన్ షాపులకే ఏ రోజుకు బియ్యం వస్తాయో తెలియకపోవడంతో డీలర్లు సైతం కార్డుదారులకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. దీంతో కార్డుదారులు రేషన్ షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు కార్డుదారులు బియ్యం కూడా తీసుకోవడం లేదు.
ఈ నెల పోర్టబిలిటీ సరఫరా లేనట్టేనా?
రేషన్ దుకాణాలకు చేరాల్సిన జనరల్ కోటా మంగళవారం నాటికి కూడా చేరకపోవడంతో పోర్టబిలిటీ బియ్యం రేషన్ షాపులకు చేరేనా? అనే అనుమానాన్ని రేషన్ డీలర్లు వ్యక్తం చేస్తున్నారు. వన్ నేషన్-వన్ రేషన్ విధానం ద్వారా కార్డుదారుడు ఏ రేషన్ దుకాణంలోనైనా బియ్యం తీసుకోవచ్చు. ఏ జిల్లాకు చెందిన వారు వచ్చినా కార్డు నెంబరు ఆధారంగా డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్నారు.
అయితే ఆ రేషన్ షాపు పరిధిలోని అసలు వినియోగదారులు నష్టపోకూడదనే ఉద్దేశంతో పోర్టబిలిటీ రిక్వెస్ట్ ప్రక్రియను తీసుకొచ్చారు. దీని ద్వారా సదరు రేషన్ డీలర్లు ఆ షాపు పరిధిలో మిగిలి ఉన్న కార్డుదారుల అవసరం మేరకు పోర్టబిలిటీ రిక్వెస్ట్ పెట్టి.. కావాల్సిన బియ్యం షాపులకు చేరవేయాలని కోరుతారు. వచ్చిన బియ్యాన్ని గడువులోగా అందుబాటులో ఉండి పంపిణీ చేస్తారు. అయితే జిల్లావ్యాప్తంగా అనేక రేషన్ షాపులకు బియ్యం చేరకపోవడంతో ఇక పోర్టబిలిటీ రిక్వెస్ట్ పరిస్థితి ఏమిటని డీలర్లు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి త్వరితగతిన బియ్యం షాపులకు చేరేలా చర్యలు తీసుకోవాలని, కార్డుదారుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను తొలగించాలని డీలర్లు వేడుకుంటున్నారు.