కారేపల్లి, ఏప్రిల్ 06 : కార్మికుల కష్టాన్ని కార్పొరేట్లకు దోచి పెట్టడానికే మోదీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ లను తెచ్చిందని సీఐటీయూ కారేపల్లి మండల కన్వీనర్ కే.నరేంద్ర అన్నారు. సోమవారం కారేపల్లిలోని హమాలీ అడ్డలో సీఐటీయూ నేతలు బీటీ రణదీవే, ఎర్ర శ్రీకాంత్ వర్ధంతిని నిర్వహించారు. అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్మికోద్యమాన్ని దేశ వ్యాప్తంగా విస్తరించడంలో బీటీఆర్ చేసిన సేవలు అమోఘమన్నారు. ఖమ్మం జిల్లాలో సీఐటీయూ విస్తరణకు ఎర్ర శ్రీకాంత్ ఎంతో కృషి చేశారన్నారు.
పని గంటల పెంపు, కనీస వేతనాల అమలు, సంఘం ఏర్పాటు హక్కు, సమ్మె హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు కార్మికులను బలి పశువులుగా మార్చే విధానాలకు వ్యతిరేకంగా బీటీ రణదీవె, ఎర్ర శ్రీకాంత్ చూపిన పోరాట బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఆరేల్లి శ్రీరాములు, హమాలీ యూనియన్ గౌరవాధ్యక్షుడు ముక్కా సీతారాములు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు కేలోతు రవి, రైతు సంఘం మండల అధ్యక్షుడు ముండ్ల ఏకాంబరం, సీఐటీయూ నాయకులు తురక సంపత్, తిరపయ్య, సైదులు, బాబు, కోటయ్య, నూకల నగేష్ పాల్గొన్నారు.