మధిర రూరల్, నవంబర్ 8 : కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన పత్తికి కొర్రీలు పెడుతూ.. నిబంధనలు, షరతులు విధిస్తూ ఇప్పటివరకు కేజీ కూడా కొనలేదని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు ఆరోపించారు. ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను తుంగలో తొక్కి నట్టేట ముంచుతున్నదని మండిపడ్డారు.
దెందుకూరు గ్రామంలోని కనకదుర్గ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. పత్తి విక్రయానికి తీసుకొచ్చిన రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తేమ శాతం పేరుతో రైతులు తీసుకొచ్చిన పత్తిని వెనుకకు పంపిస్తున్నారని, దీంతో కొందరు రైతులు దళారులకు అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు ఎలాంటి షరతులు లేకుండా రైతుల పత్తిని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, కటికల సత్యనారాయణరెడ్డి, పార్టీ మండల, పట్టణ కార్యదర్శులు బొగ్గుల భాస్కర్‌రెడ్డి, అరిగె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.