బోనకల్లు, డిసెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర స్వరూపాన్ని మారుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు.. చివరికి తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని మార్చారని జడ్పీ, టీఎస్ సీడ్స్ మాజీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కొండబాల కోటేశ్వరరావు విమర్శించారు. తెలంగాణ అస్తిత్యానికి, ఉద్యమానికి స్ఫూర్తిగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం దుర్మార్గమని అన్నారు. అసలైన తెలంగాణ తల్లి విగ్రహాన్నే మనం గౌరవించుకుందామని పిలుపునిచ్చారు.
బోనకల్లు మండలం నారాయణపురం గ్రామంలో సోమవారం పర్యటించిన వారు.. స్థానిక యువకులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి అక్కడి తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యమం సమయంలో ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలను నిర్మించుకున్నామని, ఆ విగ్రహాల స్ఫూర్తితో ఉవ్వెత్తున ఉద్యమించి స్వరాష్ర్టాన్ని సాధించుకున్నామని వివరించారు. కానీ ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ పాలకులు తమ స్వార్థం కోసం తెలంగాణ విగ్రహ రూపాన్ని మార్చారని విమర్శించారు.
అలాగే, ఎన్నికల సమయంలో అనేక హామీలచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటిల్లోని ఏ ఒక్క హామీనీ అమలుచేయలేకపోయిందని దుయ్యబట్టారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించి కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు బంధం శ్రీనివాసరావు, వేమూరి ప్రసాద్, కొండా, మోదుగుల నాగేశ్వరరావు, కాకాని శ్రీనివాసరావు, ఇటికాల శ్రీనివాసరావు, పారా ప్రసాద్, గద్దల వెంకటేశ్వరరావు, కనకయ్య, జెర్రిపోతుల రవీందర్, కొనకంచి నాగరాజు, కంచర్ల అచ్చయ్య, యనమద్ది శ్రీను, వల్లెబోయిన కొండ, చిట్టిమోదు శ్రీనివాసరావు, వీరబాబు, బాబు, రాధాకృష్ణ, రూబీన్ తదితరులు పాల్గొన్నారు.