బోనకల్లు, జనవరి 11 : స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇప్పటినుంచే కష్టపడి పనిచేస్తే మంచి ఫలితం దక్కుతుందని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. రావినూతల గ్రామంలో మాజీ సర్పంచ్ కొమ్మినేని ఉపేంద్ర నివాసంలో మండల పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు అధ్యక్షతన శనివారం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారన్నారు. రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, మహిళలకు రూ.2,500 పెన్షన్ ఇస్తామని నేటికీ ఇవ్వకపోవడం ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో కలిసొచ్చే పార్టీలను కలుపుకొని అత్యధిక స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
గత కేసీఆర్ పదేళ్ల పాలన, నేటి రేవంత్రెడ్డి పాలనపై వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగాలన్నారు. అనంతరం గ్రామాలవారీగా పార్టీ అంతర్గత వివరాలు, సమస్యలపై చర్చించారు. అనంతరం రైలు ప్రమాదంలో మృతిచెందిన బీఆర్ఎస్ కార్యకర్త జర్పుల నాగేంద్రబాబు భార్య పౌలికకు రూ.2 లక్షల బీమా చెక్కును అందజేశారు. సమావేశంలో మధిర మార్కెట్ మాజీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ బానోతు కొండ, రైతుబంధు మాజీ కన్వీనర్ వేమూరి ప్రసాద్, ఎస్సీ సెల్ నాయకుడు గద్దల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.