మధిర, జనవరి 10: మట్టి మాఫియాను అధికారులు ప్రోత్సహిస్తున్నారని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్‌రాజు మండిపడ్డారు. అక్రమాలను కట్టడి చేయాల్సిన అధికారులే కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అనుబంధ రైతు సంఘం నాయకులతో కలిసి మధిర మండలం వంగవీడు గ్రామంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. అక్కడి ఎన్నెస్పీ కాలువలోని మట్టిని కాంట్రాక్టర్లు పొక్లెయిన్ ద్వారా తరలిస్తున్న విషయాన్ని గమనించారు. అలా తరలిస్తున్న లారీలను, పొక్లెయినర్‌ను నాయకులు అడ్డుకొని పరిశీలించారు.
ఈ సందర్భంగా కమల్‌రాజు మాట్లాడుతూ.. సిరిపురం – వంగవీడు గ్రామాల మధ్య గల ఉపయోగం లేని సాగర్ పంట కాలువలో కాంట్రాక్టర్లు మట్టిని తొవ్వుతున్నారని అన్నారు. రెండు, మూడు అడుగుల మేర ఉన్న కాలువను ఏకంగా 10 అడుగుల లోతులో తొవ్వుతున్నారని, రైతుల పంట పొలాలను ధ్వంసం చేస్తూ లారీల ద్వారా ఆ మట్టిని తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా అధికారులు పట్టించుకోకుండా కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
ఒకవైపు తమది రైతు ప్రభుత్వమంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వయంగా డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న మధిరలో దళిత రైతులకు ఇంతటి అన్యాయం జరుగుతుండడం దారుణమని వాపోయారు. ఇలాంటి అధికారులపై కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకొని అక్రమ మట్టి తోలకాలను నిలిపివేయాలని కోరారు. బీఆర్ఎస్ నేతలు, అనుబంధ రైతు సంఘం నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, అరిగె శ్రీనివాసరావు, వంకాయలపాటి నాగేశ్వరరావు, ఉమామహేశ్వరరెడ్డి, కొత్తపల్లి నరసింహారావు, చీదిరాల రాంబాబు, నాగులవంచ రామారావు, వేల్పుల శ్రీనివాస్, బొగ్గుల వీరారెడ్డి, నరసింహారెడ్డి, ఓబుల ఆదినారాయణరెడ్డి, దర్శి నాగేశ్వరరావు, మోదుగు సంపత్ తదితరులు పాల్గొన్నారు.