మధిర, ఏప్రిల్ 26: రాష్ట్రంలో గుంటనక్కల పాలన కొనసాగుతున్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనం శూన్యమని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు విమర్శించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోరుతూ పార్టీ నేతలు మధిరలో శనివారం మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
అమరవీరుల స్తూపం వద్ద రైతుబంధు మాజీ కన్వీనర్ చావా వేణుబాబు నివాళి అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్‌రెడ్డి పూలమాల వేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కమల్‌రాజు మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్, పెన్షన్లు ఇచ్చినట్లు గుర్తుచేశారు.
కాంగ్రెస్ నాయకులు అమలుకు వీలుకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్ఎస్ బహిరంగ సభకు వచ్చేవారు వారికి కేటాయించిన బస్సుల్లోనే రావాలన్నారు. వేసవికాలం కావడం వల్ల ఉదయం పూటనే బయల్దేరి సభా ప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, బీఆర్ఎస్ మండల కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు, ముత్తారపు ప్యారీ, వంకాయలపాటి నాగేశ్వరరావు, సత్యనారాయణరెడ్డి, నాగబాబు, వీరారెడ్డి, నరసింహారావు, అప్పారావు, సయ్యద్ ఇక్బాల్, ఉమామహేశ్వరరెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.