ఎర్రుపాలెం, మే 7 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు మండిపడ్డారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాలకు పంట ఉత్పత్తులు తరలించి కొనుగోళ్ల కోసం రైతులు ఎదురుచూస్తుంటే.. వాటిని పట్టించుకోకకుండా రైతు ఉత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. భీమవరం గ్రామంలో గురువారం మొకజొన్న, వరి రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించిన అనంతరం మాజీ జడ్పీటీసీ శీలం కవిత గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం మొద్దునిద్ర వీడి ధాన్యం, మక్కల కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. పంట ఉత్పత్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదన్నారు. మొక్కజొన్న ఎకరానికి 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా.. ప్రభుత్వం 25 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమే అవుతుందన్నారు. మిగిలిన పంటను అతి తకువ ధరలకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
ట్రాన్స్పోర్ట్ సమస్యల వల్ల యార్డుల్లో ధాన్యం, మొకజొన్న కుప్పలుగా పేరుకుపోయి నాణ్యత దెబ్బతింటోందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మిల్లర్లు క్వింటాకు 10 కిలోల వరకు కటింగ్ చేస్తున్నారని, ఇది అత్యంత దారుణమైన విషయమన్నారు. ఎన్నికల సమయంలో రైతు భరోసా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి చివరకు సన్నాలకే పరిమితం చేయడం రైతులను మోసం చేయడమే అవుతుందన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రవీడి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యన్నం శ్రీనివాసరెడ్డి, శీలం కవిత, శేగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, సంక్రాంతి కృష్ణారావు, కోట శ్రీనివాసరావు, షేక్ బహదూర్, శీలం కృష్ణారెడ్డి, శ్రీపాలశెట్టి తిరుపతిరావు, బొర్రా నరసింహారావు, కాలసాని వెంకటనారాయణ, గుర్రాల రవి, అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటేశ్వరరావు, ప్రసాద్‌రెడ్డి, వేణు, వెంకటరెడ్డి, వసంత్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.