పెనుబల్లి, మే 13 : కొనుగోలు కేంద్రాల్లో రైతుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయని, వారి గురించి పట్టించుకోనే వారే కరువయ్యారని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు. రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న బాధలు వారికి పట్టడం లేదన్నారు. వరి, మొకజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెనుబల్లి మండల కేంద్రంలో బుధవారం ధర్నా నిర్వహించారు.
కార్యక్రమంలో పాల్గొన్న సండ్ర మాట్లాడుతూ మార్చిలో వరి కోతలు ప్రారంభమైతే, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టిన తర్వాతే హడావుడిగా కొనుగోళ్లు చేపట్టారన్నారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోళ్లు చేపట్టకపోవడంతో 70 శాతం ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకోవాల్సి వచ్చిందని, మిల్లర్లు బస్తాకు 12 కేజీల వరకు తాలు తీసి రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. మక్కల కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు క్వింటాకు రూ.800 వరకు నష్టపోతున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని, బస్తాలు ఇవ్వాలన్నా, కాంటా వేయాలన్నా పార్టీలను చూస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు అతీతంగా ప్రతీ గింజ కొనుగోలు చేసి, రైతాంగానికి అండగా నిలిచామని గుర్తు చేశారు.
అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన సండ్ర.. ఐకేపీ ఏపీఎంను కలిసి 50 రోజులుగా కొనుగోళ్ల విషయంలో రైతులు ఎదురొంటున్న సమస్యలను వివరించి, వెంటనే పరిషరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కూసంపూడి మహేశ్, కొత్తూరు ఉమామహేశ్వర్, హరికృష్ణారెడ్డి, చెకిలాల మోహన్‌రావు, చెకిలాల లక్ష్మణ్‌రావు, కోటగిరి సుధాకర్‌బాబు, మందాడపు అశోక్‌కుమార్, సర్పంచ్‌లు పాప, నారపోగు శారద, లకినేని అలేఖ్య వినీల్, చలికాని నీలాద్రిబాబు, దొడ్డపనేని రవి, ఏటుకూరి వెంకట అప్పారావు, బెల్లంకొండ చలపతిరావు, టీవీ రామారావు, చింతనిప్పు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.