కూసుమంచి, డిసెంబర్ 8: మాదిగలు పోరాడి సాధించుకున్న రిజర్వేషన్లు అమలు కావాలంటే అంతా సమష్టిగా ఉండి పోరాటం సాగించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. మాలలకు మనం వ్యతిరేకం కాదని, మన వాటా కోసం మాత్రమే వారితో విభేదిస్తున్నామని అన్నారు. నాయకుడు మంద కృష్ణమాదిగకు మద్దతుగా ఉండి మన సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. కూసుమంచిలో ఆదివారం జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం, మన భోజనాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
దశాబ్దాలుగా వెనుకబాటుకు గురై అనేక ఇబ్బందులు పడిన మనం ఎన్నో ఉద్యమాల అనంతరం సాధించుకున్న వాటా అమలయ్యే వరకు అలుపెరగని పోరాటం చేయాల్సి ఉందన్నారు. ఎవరికీ వ్యతిరేకం కాకుండా మన వాటా ప్రకారం అన్నిరంగాల్లో పట్టు సాధించాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే అన్ని కార్యక్రమాల్లో అంతా సమష్టిగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల బాధ్యులు పోలెపంగు ముత్తయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చేకూరి రమేశ్, డాక్టర్ గోపి, మాజీ ఎంపీడీవో గద్దల చంద్రయ్య, స్థానిక నాయకులు, మాజీ ఎంపీపీలు గురవయ్య, ముత్తయ్య, భరత్‌చంద్ర, ఉపేందర్, అంబేద్కర్, పరశురాం పాల్గొన్నారు.