సత్తుపల్లి, నవంబర్ 27: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే దీక్షా దివస్‌కు వేలాదిగా తరలిరావాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. తల్లాడ మండల కేంద్రంలో బుధవారం జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ చేపట్టిన దీక్ష, ప్రాణాలకు తెగించి చేసిన పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకూ అందాయని; రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించిందని జ్ఞప్తికి తెచ్చారు. ఈ నెల 29న ఖమ్మంలో చేపట్టే దీక్షా దివస్ కార్యక్రమానికి మండలం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దొడ్డా శ్రీనివాసరావు, దుగ్గిరాల వెంకట్‌లాల్, దిరిశాల దాసురావు, మువ్వా మురళి, రామిరెడ్డి, జీవీఆర్, నున్నా శ్రీను, కొమ్మినేని శ్రీను, బ్రహ్మం, శివారెడ్డి, కిరణ్, ఎస్ఎస్ రెడ్డి, శశికుమార్, లింగయ్య, యాకూబ్ పాల్గొన్నారు.