వైరా టౌన్ (తల్లాడ), నవంబర్ 17: ‘ధాన్యం తెచ్చి పది రోజులవుతున్నా ఇంకా కాంటాలు వేయరా?’ అంటూ సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రశ్నించారు. రోజుల తరబడి కాంటాలు వేయకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లాడ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సండ్ర వెంకటవీరయ్య ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను విరివిగా పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల ఇబ్బందుల దృష్ట్యా వెంటనే కాంటాలు వేసి కొనుగోళ్లు పూర్తి చేయాలని, ప్రైవేటు వ్యాపారులకు రైతులు అమ్మిన ధాన్యానికీ రూ.500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద కూడా తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని అన్నారు. ప్రైవేటు వ్యాపారులకు అనుకూలంగా సీసీఐ కేంద్రాలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. పత్తి రైతులకు ఇబ్బందులు కలగకుండా సీసీఐ కేంద్రాలకు తెచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు.