ఖమ్మం, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హైదరాబాద్ నగరానికి విశ్వవ్యాప్త గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా గత కేసీఆర్ ప్రభుత్వంలో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్‌ను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు.
ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ కేసులను బనాయించి బీఆర్ఎస్ను దెబ్బ తీయాలనే కుట్రలను తెలంగాణ ప్రజలు సహించరన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చిన ఘనత కేటీఆర్‌దే అన్నారు. ప్రభుత్వానికి ధైర్యముంటే ఫార్ములా అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసిందన్నారు. జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ ఫార్ములా ఈ-రేస్‌ను కొనసాగిస్తే కేసీఆర్, కేటీఆర్‌కు ఎక్కడ మరింత మంచి పేరు వస్తుందోననే దురుద్దేశంతోనే కేసు పెట్టారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి మాట్లాడుతూ అక్రమ కేసుల ద్వారా బీఆర్ఎస్ను ఏమీ చేయలేరని, గులాబీ శ్రేణులను భయపెట్టలేరని స్పష్టం చేశారు. ఉద్యమకారులు, నేతలు ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రామ్మూర్తి, ఆర్జేసీ కృష్ణ, బిచ్చాల తిరుమలరావు, శీలంశెట్టి వీరభద్రం, బెల్లం వేణు, ఎడ్డపల్లి వరప్రసాద్, తాజుద్దీన్, పద్మ, కృష్ణారావు పాల్గొన్నారు.
మణుగూరు టౌన్, డిసెంబర్ 20: ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నందున దానిని డైవర్షన్ చేయడానికే కేటీఆర్‌పై అక్రమ కేసు నమోదు చేయించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు. అక్రమంగా కేసులు బనాయిస్తే రేవంత్ ప్రభుత్వానికి కోర్టులో మొట్టికాయలు తప్పవని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఫార్ములా -ఈ రేస్ నిర్వహించిన కేటీఆర్.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచితే.. అందులో అవినీతి జరిగిందని రేవంత్‌రెడ్డి అడ్డంగా వాదిస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి బీఆర్ఎస్ మీద కక్ష తప్ప ప్రజాపాలన మీద దృష్టి లేదని ఆరోపించారు. విజ్ఞులైన ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ మీద పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టించడం హేయమైన చర్య అని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కార్ ఆటవిక పాలన సాగిస్తున్నదని ధ్వజమెత్తారు.
ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక ప్రతిపక్ష పార్టీల నేతలపై తప్పుడు కేసులు బనాయించి.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నిత్యం ప్రజల పక్షాన నిలుస్తున్న కేటీఆర్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆయన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఇవన్నీ విజ్ఞులైన తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ నేతలపై పెట్టిన తప్పుడు కేసులు విరమించుకొని.. ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.