జూలూరుపాడు, నవంబర్ 8 : అలవిగాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంతో పూర్తిగా విఫలమైందని, పథకాల విషయంలో రైతులకు ఇచ్చిన మాట కూడా తప్పిందని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు కల్యాణలక్ష్మితోపాటు పెళ్లి కానుకగా తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రతి మహిళకు రూ.2,500 చొప్పున పింఛన్, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికుల పింఛన్లు పెంచుతామని చెప్పి మోసం చేసిందన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పేరిట రూ.10 వేలు ఇస్తే.. దాని పేరు రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15 వేలు ఇస్తామని చెప్పి 11 నెలలు గడిచినా అతీగతీ లేదన్నారు. ఆరుగాలం శ్రమించి పత్తి, ధాన్యం పండించిన రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ధాన్యం చేతికొస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం బీఆర్ఎస్దేనని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు, చావా వెంకట రామారావు, చాపలమడుగు రామ్మూర్తి, సాయిల నాగేశ్వరరావు, తాళ్లూరి రామారావు, సాయిన్ని హరీశ్, నవీన్, బాదావత్ కిషన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.