భద్రాచలం, నవంబర్ 10: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. భద్రాచలం నియోజకవర్గంలోని పార్టీ మండలాల అధ్యక్షులు, కన్వీనర్లు, కోకన్వీనర్లతో పట్టణంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను గ్రామగ్రామానా ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వంలో ఏం కోల్పోయారో ప్రజలకు ఇప్పటికే అర్థమైందని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లోనూ పార్టీ బలంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో అన్ని గ్రామాల్లోనూ కాంగ్రెస్ వ్యతిరేక విధానాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని సూచించారు.
భవిష్యత్‌లో కేసీఆరే ముఖ్యమంత్రిగా మళ్లీ గెలవబోతున్నారని రేగా స్పష్టం చేశారు. పార్టీని కష్టకాలంలో వదిలిపెట్టిన వారు ఎంతటి పెద్దవారైనా తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదని తేల్చిచెప్పారు. నియోజకవర్గంలో జరిగే మండలాల జనరల్ బాడీ సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, వాజేడు, వెంకటాపురం మండలాల అధ్యక్షులు పెనుమల్లు రామకృష్ణారెడ్డి, గంపా రాంబాబు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల కన్వీనర్లు, కో కన్వీనర్లు దొడ్డి తాతారావు, ఐనవోలు పవన్‌కుమార్, కణితి రాముడు, ఎండి.జానీపాషా, ఆకోజు సునీల్‌కుమార్, రేపాక పూర్ణచందర్రావు పాల్గొన్నారు.
నూతనంగా ఎన్నికైన కన్వీనర్లు, కో కన్వీనర్లు, ఆయా మండలాల అధ్యక్షులు కలిసి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావును, నియోజకవర్గ నాయకుడు మానే రామకృష్ణను ఇక్కడ సత్కరించారు. రేగాను సత్కరించిన వారిలో భద్రాచలం, వాజేడు, వెంకటాపురం మండలాల అధ్యక్షులు, కన్వీనర్, కో కన్వీనర్లు ఆకోజు సునీల్‌కుమార్, రేపాక పూర్ణచందర్రావు, పెనుమల్లు రామకృష్ణారెడ్డి, గంపా రాంబాబు, దొడ్డి తాతారావు, ఐనవోలు పవన్‌కుమార్, కణితి రాముడు, ఎండీ జానీపాషా తదితరులు ఉన్నారు.