మణుగూరు టౌన్, అక్టోబర్ 3: ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పైనా, అటు నటుడు నాగార్జున కుటుంబంపైనా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విమర్శించారు.
ఇంతటి ఆక్షేపణీయమైన మాటలు మాట్లాడిన మంత్రి సురేఖపై కాంగ్రెస్ అధిష్టానంగానీ, సీఎం రేవంత్‌రెడ్డిగానీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం గౌరవమున్నా వెంటనే ఆమెను బర్తరఫ్ చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాజకీయాల్లో గతంలో ఏ మంత్రి కూడా ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయలేదని గుర్తుచేశారు.
అయినా, మంత్రి సురేఖ వ్యాఖ్యలు ఇంతమంది మనోభావాలను దెబ్బతీస్తుంటే ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. తమ నాయకుడు కేటీఆర్‌పై చిల్లరమల్లర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. సోషల్‌మీడియాలో సురేఖను ఎవరో ట్రోల్ చేస్తే ఆ నెపాన్ని బీఆర్ఎస్ మీదకు నెట్టడం కాంగ్రెస్ కుట్రేనని తేల్చిచెప్పారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి సురేఖ పాత్రధారులను ఆరోపించారు.