కొత్తగూడెం అర్బన్, నవంబర్ 25 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ విధానాలు, కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా కేసీఆర్ దీక్షా స్ఫూర్తితో పోరాటాలు చేస్తామని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 29న చేపట్టనున్న దీక్షా దివస్ను విజయవంతం చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశానికి రేగా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009, నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడంతోనే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరిందన్నారు. ఆయన దీక్షతోనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేసిందన్నారు. పదేళ్లు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎలాంటి లోటు లేకుండా పాలన అందించారన్నారు. కానీ.. అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై 11 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగా మిగిలిపోయాయని ఆరోపించారు.
అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, బానోతు హరిప్రియానాయక్, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, నాయకులు మానె రామకృష్ణ, మంతపురి రాజుగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, సీనియర్ నాయకులు మోరె భాస్కర్రావు, సంకుబాపన అనుదీప్, కొట్టి వెంకటేశ్వర్లు, పూజిత, వెంకటరెడ్డి, పోచం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.