దమ్మపేట, మార్చి 13: గండుగులపల్లి ఏకలవ్య మోడల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకోరా అని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు మండిపడ్డారు.
స్థానిక నాయకులతో కలిసి పాఠశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను శుక్రవారం ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తోందని, ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి కూల్చివేతల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదని, కుళ్లిన కూరగాయలతో, నాణ్యత లేని భోజనం పెట్టి ఎవరి ప్రాణాలు తీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సుమారు 30 మంది గిరిజన విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారంటే అది సిబ్బంది నిర్లక్ష్యమే కాదని, ప్రభుత్వాల అసమర్థత కూడా అని ఆరోపించారు. విద్యారంగాన్ని నెంబర్ వన్‌గా మార్చేస్తా అని పదే పదే గొప్పలు చెప్పుకునే వారు ఎటు వెళ్లారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి, బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, సోయం వీరభద్రం, మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి, సర్పంచ్‌లు కొమరం సుశీల, తోగర్త అనిత, మీడియం వెంకటేశ్వరరావు, నాయకులు తుమ్మల లక్ష్మణ్‌రావు, దారా యుగంధర్, అబ్దుల్ జిన్నా, మల్లేశ్, పుల్లారావు, రెడ్డిమల్ల నాగయ్య, దండాబత్తుల కాంతారావు, మహేశ్, బండి ప్రసాద్, యువజన విభాగం మండల అధ్యక్షుడు మండవ సత్య, పండు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.