దమ్మపేట, నవంబర్ 3: మాయమాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని, ఎన్నికల సమయంలో ఆ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు అటకెక్కాయని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆరోపించారు. దమ్మపేట బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 100 రోజులు కాదు.. 300 రోజులైనా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేసేవారు లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నా మంత్రులకు, ఎమ్మెల్యేలకు కనిపించడంలేదని దుయ్యబట్టారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రమంతా గులాబీజెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్పై మంత్రులు బాంబులు వేయడం కాదని.. కాంగ్రెస్ వాళ్లే కాంగ్రెస్ వాళ్లపై బాంబులు వేసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 32,820 ఎకరాల్లో మాత్రమే పామాయిల్ ఉందని, కానీ కేసీఆర్ ప్రభుత్వంలో 1,94,180 ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్ష ఎకరాలకు లక్ష్యం పెట్టుకుంటే కేవలం 18 వేల ఎకరాల్లో మాత్రమే మొక్కలు నాటారని అన్నారు. 2021-22లోనే అప్పారావుపేట ఫ్యాక్టరీకి 19.32 ఓఈఆర్ వచ్చిందని, ప్రస్తుతం మాత్రం 19.40 శాతమే వచ్చిందని అన్నారు.
దీనికి కారకులైన కేసీఆర్కు పామాయిల్ రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. 11 నెలలైనా నేటికీ రైతుబంధు రాలేదని, 30 శాతం రైతులకు రుణమాఫీ జరగలేదని విమర్శించారు. నియోజకవర్గంలో రిఫైనరీ ఫ్యాక్టరీ పెట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు జోగేశ్వరరావు, దొడ్డా రమేశ్, సోయం వీరభద్రం, దారా యుగంధర్, రావుల శ్రీను, ఏసుబాబు, రూప్సింగ్, చిన్నవెంకటేశ్వరరావు, నారం రాజు, ధర్మ, పాకనాటి శ్రీను, పండు, లాలు, గణేశ్, రాజు, మనోజ్, తాళ్ల వెంకటేశ్వరరావు, పాశం ప్రసాద్, నాగయ్య, నాగరాజు, నాగేంద్ర, రవితేజ, భరత్, రమేశ్, పుల్లారావు, నాగేశ్వరరావు, శ్రీను, అబ్దుల్ జిన్నా, ఉమామహేశ్వరరావు, నడిపల్లి పోలయ్య, కొండముచ్చి నాగు పాల్గొన్నారు.