దమ్మపేట, అక్టోబర్ 28 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. రాజకీయంగా కేటీఆర్‌ను ఎదుర్కోలేక కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మండిపడ్డారు. మండల కేంద్రంలోని మసీద్ కాంప్లెక్స్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడం చేతకాక.. కేటీఆర్ కుటుంబ సభ్యులపై డ్రగ్స్ పేరిట అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు, ఆటో కార్మికులు, ఉద్యోగులు, సామాన్యులు తీవ్రంగా నష్టపోయారని, రూ.2 లక్షల రుణమాఫీని పక్కకు పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై ఆయా వర్గాల ప్రజలు ఎక్కడ తిరగబడతారోననే ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్‌కు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందన్నారు.
రాష్ట్రంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు కుటుంబాలకు సైతం రక్షణ లేకుండా పోయిందని, పోలీస్ కానిస్టేబుళ్లు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. గత కేసీఆర్ పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించారని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్ని విధాల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు దారా యుగంధర్, యార్లగడ్డ శ్రీనివాసరావు, రూపా రాంబాబు, నాగయ్య, భూక్యా రాజు తదితరులు పాల్గొన్నారు.