అశ్వారావుపేట, జూన్ 26 : అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందని, ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో అన్ని రంగాలకు ప్రాధాన్య ఇచ్చి అభివృద్ధి చేసి, సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చేసిందన్నారు. గిరిజన నియోజకవర్గమైన అశ్వారావుపేట అభివృద్ధికి అడిగిన వెంటనే కేసీఆర్ నిధులు విడుదల చేశారని, రూ.800 కోట్లకు పైగా అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో మళ్ళీ కాబోయే సీఎం కేసీఆరేనని ఆయన జోస్యం చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని అలాగే కొనసాగించాలని సీఎం రేవంత్రెడ్డి, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేను ఆయన డిమాండ్ చేశారు.
సెంట్రల్ లైటింగ్, తారు, సీసీ రోడ్లను పూర్తి చేయకుండా ఇప్పటి ప్రభుత్వం నిర్లక్ష్య దోరణి అవలంబిస్తోందని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పదవులు, ఆస్తులను కాపాడుకునేందుకు పార్టీ మారే నేతలను పట్టించుకోమని, పార్టీకి బలమైన కార్యకర్తలే పునాది అని, వారికి ఏ కష్టమొచ్చినా పలికే విధంగా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. తాను గత ఎన్నికల్లో గెలిచి ఉంటే అశ్వారావుపేట మండలం వినాయకపురం, దమ్మపేట మండలం పట్వారీగూడెం గ్రామాలను మండల కేంద్రాలు చేయడంతోపాటు అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అయ్యేదని తెలిపారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతోనే మార్పు చూడాలనే ఉద్దేశంతోనే ప్రజలు ఆ పార్టీని గెలిపించారని, కానీ.. బీఆర్ఎస్పై ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదన్నారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్పై వచ్చే తప్పుడు ఆరోపణలను నమ్మొద్దని పార్టీ క్యాడర్, ప్రజలను కోరారు. తెలంగాణకు కేసీఆర్యే భవిష్యత్ అని, ఆయన కచ్చితంగా మళ్ళీ సీఎం అవుతారని పునరుద్ఘాటించారు. సమావేశంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, మాజీ జడ్పీటీసీ జేకేవీ రమణారావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ, నాయకులు తాడేపల్లి రవి, కాసాని చంద్రమోహన్, హస్సేన్, రఘురాం తదితరులు పాల్గొన్నారు.