ఖమ్మం రూరల్, జనవరి 30 : ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలు కూడా కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సబ్బండ వర్గాల పరిస్థితి దుర్భిక్షంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి 18వ డివిజన్ యందుగల బారుగూడెంలో కాంగ్రెస్ నాయకుడు పొన్నెకంటి యాకూబ్ ఆధ్వర్యంలో బారుగూడెంతోపాటు ఆయా కాలనీలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన 100 కుటుంబాలు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. వారికి మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్‌తో కలిసి గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం వేణు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కందాల మాట్లాడారు. గత ఐదేళ్ల కాలంలో బారుగూడెం ప్రజలతోపాటు యావత్ పాలేరు నియోజకవర్గ ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నానని తెలిపారు.
కొత్తగా వచ్చిన నాయకుడు పాలేరును ఏలుతున్నాడు తప్ప ప్రజల బాగోగుల గురించి పట్టించుకోవడం లేదని తీవ్రంగా ఆరోపించారు. మున్సిపాలిటీ ఏర్పాటు కాకముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పంచాయతీ వాహనాలు, పారిశుధ్య సిబ్బంది తప్ప కొత్తగా ఎలాంటి నియామకాలు, చెత్త సేకరణ వాహనాలు అందుబాటులోకి తీసుకురాలేదని మండిపడ్డారు. మునిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీపీఎం నాయకులు బండి రమేశ్, పెరుమళ్లపల్లి మోహన్‌రావు పాల్గొన్నారు.