వైరాటౌన్, మే 17 : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టభద్రులపై ఉన్నదని, ఇందుకోసం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ కోరారు. రాకేశ్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ వైరా నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మదన్‌లాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 150 రోజులు గడుస్తున్నా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగడం లేదన్నారు. గత కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రైతులు, పేదల సంక్షేమం కోసం ఎన్నోపథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. పట్టభద్రులు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి ఓట్లు వేసే విధంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు ఖాయమని అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.