ఇల్లెందు, జనవరి 30 : కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్, ఎన్నికల ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ మండిపడ్డారు. ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీ శుక్రవారం పాత బస్టాండ్ సెంటర్ నుంచి బుగ్గవాగు, కొత్త బస్టాండ్ మీదుగా గోవింద్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా హరిప్రియానాయక్, ఆర్జేసీ కృష్ణ, సీపీఎం నాయకుడు నబీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీని చూస్తుంటే మేడారం జాతరను తలపించేలా ఉందన్నారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఇల్లెందులో బస్సు డిపో, వంద పడకల ఆసుపత్రి, సెంట్రల్ లైటింగ్, మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు, బుగ్గవాగు సుందరీకరణ చేసినట్లు గుర్తు చేశారు.

గ్రామాలు, పట్టణాల్లో కేసీఆర్ ప్రభుత్వం శ్మశాన వాటికలు నిర్మిస్తే కాంగ్రెస్ నాయకులు వాటిని కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. పట్టణంలో జీవో నెంబర్ 76 ద్వారా సొంతింటిపై హక్కులు కల్పిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో జీవోను పక్కనపెట్టి చోద్యం చూస్తోందని మండిపడ్డారు.
మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. బీఆర్ఎస్ నాయకులు బానోత్ హరిసింగ్నాయక్, లక్కినేని సురేందర్ రావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ జబ్బార్, ఎస్.రంగనాథ్, సిలివేరి సత్యనారాయణ, తాజుద్దీన్, దళ్సింగ్, ఇమ్రాన్, అబ్దుల్ నబి, లకావత్ దేవీలాల్, సీతారాంనాయక్, ఘాజీ, లింగయ్య, సర్పంచ్లు బోడ బాలునాయక్, కుంజా సుకనయ్య పాల్గొన్నారు.